Vijay Goat Review In Telugu: దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time). డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ యంగ్ లుక్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి ఏఐ ద్వారా విజయకాంత్ పునఃసృష్టి, త్రిష స్పెషల్ సాంగ్ వరకు... దర్శకుడు వెంకట్ ప్రభు క్రియేషన్ గురించి డిస్కషన్ నడిచింది. మరి, సినిమా ఎలా ఉంది? విజయ్ డ్యూయల్ రోల్ హిట్టా? ఫట్టా?
కథ (The Goat Movie Story): గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందంలో కీలక వ్యక్తి. అయితే, భార్య అను (స్నేహా)కు తన ఉద్యోగం గురించి చెప్పడు. ఓ మిషన్ కోసం భార్య పిల్లలతో థాయ్ లాండ్ వెళ్లినప్పుడు కొడుకు జీవన్ (విజయ్)ను కోల్పోతాడు. కుమారుడు మరణించాడని తనకు తాను గాంధీ శిక్ష విధించుకుంటాడు. స్క్వాడ్ వదిలి బయటకు వస్తాడు.
పదిహేనేళ్ల తర్వాత మాస్కోలో గాంధీకి జీవన్ కనిపిస్తాడు. కొడుకు కనిపించిన సంతోషంలో ఇండియాకు తీసుకొస్తాడు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో గాంధీ కళ్ల ముందు అతని బాస్ నజీర్ (జయరామ్)ని ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరుగా హత్యకు గురి అవుతారు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? మీనన్ (మోహన్) ఎవరు? తండ్రి గాంధీ మీద కొడుకు జీవన్ ఎందుకు పగతో ఉన్నాడు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (The Goat Review Telugu): రాజకీయాల్లో విజయ్ అడుగు పెట్టడం, మరో సినిమా చేసే అవకాశం లేదని ప్రచారం జరగడం... రీజన్స్ ఏవైనా 'ది గోట్' మీద తమిళనాడులో అంచనాలు పెరిగాయి. అయితే... తెలుగు రాష్ట్రాల్లో బజ్ అంతగా ఏర్పడలేదు. డీ ఏజింగ్ ఎఫెక్ట్ సీన్స్ మీద ట్రోల్స్ రావడం కావచ్చు, ట్రైలర్ అంత ఇంప్రెసివ్‌గా లేకపోవడం కావచ్చు... అంచనాలు లేకుండా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా విడుదలైంది. అసలు సినిమాలో విషయం ఏముంది? అని చూస్తే...
దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథలో ఏ పాయింట్ నచ్చి 'ది గోట్'కు విజయ్ ఓకే చెప్పారు? ఇందులో ఏం నచ్చి ఆయన ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు? అని ప్రీ ఇంటర్వెల్ వరకు మైండ్‌లో ఓ ఆలోచన తిరుగుతుంది. అప్పటి వరకు అంత రొటీన్, రొట్ట కొట్టుడు తమిళ సన్నివేశాలతో సినిమా సాగింది. అలాగని, ఆ ట్విస్ట్ అంత గొప్పగా ఏమీ లేదు. ఊహించడం సులభమే. కానీ, ఇంటర్వెల్ తీసిన విధానం - మెట్రోలో ఫైట్ సీక్వెన్స్ బావున్నాయి. ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది. కానీ, అక్కడ కూడా ల్యాగ్ చాలా ఉంది. ఇంటర్వెల్ ముందు కొడుకు విలన్ అని రివీల్ చేశాక... సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య ఆట ఎలా ఉంటుందో? ఆ క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుంది? అనేది ఊహించడం కష్టం కాదు. అదీ సాగదీశారు వెంకట్ ప్రభు.
స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని పేరు పెట్టారు గానీ... 'ది గోట్'లో కంటే 'తుపాకీ'లో టెర్రరిస్టులను కనిపెట్టి, చంపే సన్నివేశాలు చాలా బావుంటాయి. ఆ సీన్స్ పక్కన పెడితే... భార్య భర్తల మధ్య సన్నివేశాలు సైతం పరమ రొటీన్‌గా ఉన్నాయి. రాత్రి భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన స్నేహితులకు భార్య ఫోన్ చేసే సన్నివేశం చూసినప్పుడు వెంకట్ ప్రభులో కొత్తగా రాయాలనే తపన పోయిందా? యూట్యూబ్ రీల్స్, పాత సినిమాలు చూసి రాయడం మొదలు పెట్టారా? అని సందేహం కలిగింది. గాంధీ - నెహ్రు - బోస్ కామెడీ ట్రాక్ కూడా నవ్వించలేదు. వెంకట్ ప్రభు కథలో ట్విస్టులు ఉన్నాయ్. కానీ, అన్నీ ముందుగా తెలుస్తాయి. ఒకవేళ తెలియని ట్విస్ట్ ఏదైనా వచ్చినా ఎగ్జైట్ చేయదు. అది 'ది గోట్' స్పెషాలిటీ.
వెంకట్ ప్రభు రచన, దర్శకత్వంలో ఫాదర్ వర్సెస్ విలన్ కాన్సెప్ట్ తప్ప సినిమా అంతా పాత తమిళ వాసనలు కొట్టింది. దానికి తోడు నిడివి ఎక్కువ కావడం మరో మైనస్. క్లుప్తంగా ముగించాల్సిన సన్నివేశాలను సైతం సాగదీసి సాగదీసి చెప్పారు. ఒక్క పాటకు సరైన ప్లేస్‌మెంట్ లేదు సరికదా... ఒక్క పాట కూడా మళ్లీ వినాలని అనిపించేలా లేదు. పాటలు, నేపథ్య సంగీతంలో యువన్ శంకర్ రాజా నిరాశ పరిచారు. కెమెరా వర్క్ ఓకే. డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసిన యంగ్ విజయ్ లుక్ ట్రోల్ చేసేంత విధంగా లేదు. సినిమాలో పర్వాలేదు.
హీరోలను ఎప్పుడూ హీరోలుగా చూస్తే కిక్ ఏం ఉంటుంది? అప్పుడప్పుడూ వారిలో విలనిజం చూస్తే కిక్ ఉంటుంది. అందుకు 'ది గోట్' బెస్ట్ ఎగ్జాంపుల్. 'ఐ యామ్ వెయిటింగ్' అంటూ విజయ్ చెప్పే డైలాగులు, ఆయన హీరోయిజాన్ని తెలుగు ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూశారు. కానీ, ఈ సినిమాలో ఆయన విలనిజం చూడటం కాస్త కొత్తగా ఉంటుంది. ఇళయ దళపతిగా విజయ్ విలనిజం చూపించిన సన్నివేశాలు కొన్ని అయినా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. హీరోగా ఎప్పటిలా చేశారు. ఆయన నుంచి అభిమానులు ఆశించే మాస్ మేనరిజమ్స్, పంచ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి.
హీరోతో పాటు స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేసే ఏజెంట్లుగా ప్రభుదేవా, 'జీన్స్' ప్రశాంత్, అజ్మల్ అమీర్ కనిపించారు. వాళ్ల బాస్ పాత్రలో జయరామ్ నటించారు. ఆ పాత్రలకు తగ్గట్టు చేశారంతే. స్నేహకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. ఆ పాత్రలో ఆమె నటన బావుంది. మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో సందడి చేశారని చెప్పాలి. ఒకట్రెండు సన్నివేశాలు, పాటలో కనిపించారు.
మీనాక్షి చౌదరి పాట కంటే విజయ్, త్రిష పాట పిక్చరైజేషన్ బావుంది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్ చిన్న పాత్రలో సందడి చేశారు. ఎంఎస్ ధోని ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజ్ వాడారు. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా కెప్టెన్ విజయకాంత్‌ను చూపించడం బావుంది.
విజయ్ డై హార్డ్ అభిమానులకు మాత్రమే 'ది గోట్'. మూడు గంటల సినిమాలో ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఒక్కటీ బావుంది. ఎగ్జైట్ చేస్తుంది. విజయ్ విలనిజం, ఆ ఫాదర్ వర్సెస్ సన్ కాన్సెప్ట్ ఓకే. కానీ... దర్శకుడిగా వెంకట్ ప్రభు, సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా తీవ్రంగా నిరాశ పరిచారు.
Also Read: అహో విక్రమార్క రివ్యూ: 'మగధీర' విలన్ దేవ్ గిల్ హీరోగా నటించిన సినిమా