తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో మంది నిర్మాతలు వస్తూ ఉంటారు. ఎంతో మంది వెళుతూ ఉంటారు. అయితే... కొందరు మాత్రమే పదిమంది చెప్పుకునే సినిమాలు, పదిమందికి గుర్తుండే సినిమాలు తీస్తుంటారు. అటువంటి నిర్మాతల జాబితాలో షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి నిర్మించిన సినిమాల సంఖ్య తక్కువే. కానీ, ఆ చిత్రాలలో రెండు మంచి సినిమాలు ఉన్నాయి.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలో ఉండగా... వాళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రాలలో 'మజిలీ' ఒకటి. సినిమాలోనూ భార్యా భర్తలుగా కనిపించారు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న సినిమాలలో అది ఒకటి. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'భగవంత్ కేసరి'ని సైతం వీళ్లిద్దరూ నిర్మించారు. తెలుగు చిత్ర సీమ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పుడీ స్నేహితుల మధ్య దూరం పెరిగింది. మనస్పర్ధలు రావడంతో వేరు పడ్డారని తెలుస్తోంది.
వేరు కుంపటి పెట్టిన హరీష్ పెద్ది!
'భగవంత్ కేసరి' విడుదల తర్వాత స్నేహితులు ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఇక నుంచి వేరు వేరుగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారట. షైన్ స్క్రీన్స్ సంస్థ నుంచి హరీష్ పెద్ది వైదొలిగారని, ఇకపై ఆ సంస్థ నిర్మించే సినిమాలలో ఆయన భాగస్వామిగా ఉండరని, కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నారని సన్నిహితులు తెలిపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి సొంతంగా సినిమాలు నిర్మించనున్నారు.
మైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థను స్థాపించారు హరీష్ పెద్ది. అందులో తొలి ప్రయత్నంగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాహు గారుపాటి విషయానికి వస్తే... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు అడ్వాన్సులు ఇచ్చారు. త్వరలో వారితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?
నాని కథానాయకుడిగా నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రారంభమైంది. ఆ తరువాత 'మజిలీ' ప్రొడ్యూస్ చేశారు. తొలి సినిమా హీరో నాని, మలి సినిమా దర్శకుడు శివ నిర్వాణ కలయికలో 'టక్ జగదీష్' మూడో సినిమాగా నిర్మించారు. 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'ఉగ్రం' కూడా వాళ్లు ప్రొడ్యూస్ చేసిన సినిమాయే. 'భగవంత్ కేసరి' సినిమాతో సంయుక్త నిర్మాణానికి ముగింపు పలికారు. అది సంగతి!
Also Read : ఈ రోజు రాత్రి నుంచి 'మంగళవారం' సినిమా ప్రీమియర్లు - పాయల్ గ్లామర్ లుక్స్ చూశారా?
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ కూడా తొలుత ముగ్గురు నిర్మాతలతో ప్రారంభమైంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, చెరుకూరి మోహన్ సంయుక్తంగా కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత చెరుకూరి మోహన్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చారు. మరో ఇద్దరితో కలిసి నాని హీరోగా హాయ్ నాన్న ప్రొడ్యూస్ చేశారు.