టాలీవుడ్ సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా మార్చి 3న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సక్సెస్‌ఫుల్ టాక్ థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా కథపై గత కొద్దిరోజులుగా వివాదం జరుగుతోంది. ఈ మూవీ కథ తనది అంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి స్పందించారు.
వేణు ఎల్దండి మాట్లాడుతూ.. తనది చాలా పెద్ద కుటుంబం అని, తన కుటుంబంలో ఎవరు చనిపోయినా తమ కుటుంబ సభ్యులు అంతా వెళ్తారని అన్నారు. అయితే తమ ఫ్యామిలీలో కొంత మంది పెద్ద వాళ్లు మరణించినపుడు అక్కడ జరిగే తతంగాలు అన్నీ చూసినపుడు తనకి ఒక కొత్త ప్రపంచం కనిపించిందని, ఓ వ్యక్తి చనిపోతే ఇన్ని జరుగుతాయా, ఇన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయా అని తనకు అనిపించేదని చెప్పారు వేణు. అలాంటి వందలాది సంఘటనలు తన మనసులో నాటుకుపోయాయని అవన్నీ కలపి ఓ కథను తయారుచేసుకున్నానని అన్నారు. కాకులు ముట్టడం అనేది ఏమీ తాను కొత్తగా చూపించలేదని అది మన సాంప్రదాయమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి పుట్టినప్పటి నుంచీ ఈ సాంప్రదాయాలు ఉన్నాయని అన్నారు. అందుకే దీనిపై సినిమాచేయాలని అనుకొని సీన్స్ రాసుకున్నానని చెప్పారు. ఈ సినిమా ఓ కథ కాదని, తెలుగు వారి అందరి జీవితాల్లో జరిగే ఆచార సాంప్రదాయాలని చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఎన్నో ఏళ్లు శ్రమించానని, ఎన్నో పరిశోధనలు చేశానని తెలిపారు. వాస్తవానికి గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్ లపై సినిమాలు వచ్చాయని, అలాగని వారందరూ కాపీ కొట్టారు అంటే కుదురుతుందా అని ప్రశ్నించారు వేణు.
నిజం తెలియాలంటే తన కథను, సతీష్ రాసిన కథను చదివి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. చిల్లర పబ్లిసిటీ కోసం ఈ విధంగా చేయడం సరికాదని అన్నారు వేణు. ఈ కథను రాసి, దర్శకత్వం చేసింది తానని, ఏదైనా ఉంటే తనతో వచ్చి మాట్లాడాలని అంతేకాని నిర్మాత దిల్ రాజు లాంటి వ్యక్తులను అబాసు పాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఆ ‘పచ్చికి’ అనే కథను చూశానని, ఆ కథలో రైటర్ పర్యావరణం అనే పాయింట్ మీద కథ రాశారని, దానికి ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మన ఆచార సాంప్రదాయాలపై ఎవరైనా కథలు రాయవచ్చని, కానీ చిల్లరగా బ్లాక్ మెయిల్ చేయడం సరికాదన్నారు. కాకి అనేది మన సంస్కృతిలో భాగమని, దాని మీద కథ రాసి అదే మూల కథ అంటే ఎలా కుదురుతుంది. దాని మీద ఎవరైనా సినిమాలు చెయొచ్చు అని పేర్కొన్నారు వేణు. మరి వేణు వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.