ప్రముఖ నటి, బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేసిన కాంగ్రెస్ సపోర్టర్, ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ పాల్ కోశిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన గురించి, తన ఫ్యామిలీ గురించి అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. “నాతో మర్యాదగా మాట్లాడాలి. లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేయకూడదు. ఒకవేళ కాదని ఎవరైనా నా గురించి కానీ, నా కుటుంబ గురించి గానీ అవాకులు చవాకులు పేలితే గాయపడిన పులిలా తిరగబడతా. స్వంత ఆలోచన లేని పార్టీ లేదా నాయకుడితో కలిసి పని చేసేందుకు నేను నిరాకరిస్తున్నాను. నా భర్త గురించి మరోసారి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు” అంటూ ఫైర్ అయ్యారు.  


ఇంతకీ పాల్ కోశి ఏమన్నారంటే?


ప్రముఖ ఇంజినీర్, బిజినెస్ కన్సల్టెంట్ గా రాణిస్తున్న పాల్ కోశి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారు. త్వరలో కర్నాటకలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ జాతీయ చానెల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో కుష్బూ బీజేపీ తరఫున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం సెక్యులర్ దేశం అని చెప్పారు. ఏ మతానికి, కులానికి చెందినది కాదన్నారు. బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి ఈ దేశాన్ని ఎంతో అద్భుతంగా పాలించాన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తుందని చెప్పడం సరికాదన్నారు. ఈ వీడియో క్లిప్ ను పాన్ కోశి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ, కుష్బూ బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో చెప్పారు. “కుష్బూ ఆ చర్చలో మాట్లాడినప్పుడు నేను ప్రేక్షకులలో కూర్చున్నాను. తను మాట్లాడిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ, ఆమె భర్తను కేసుల నుంచి కాపాడుకోవడానికే బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. కొన్ని చీకటి వ్యాపారాల కారణంగా తన భర్త జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు. బీజేపీలో చేరుతాననే డీల్ తో  భర్తను కేసుల నుంచి కాపాడుకుంటోంది. ఆమె బీజేపీలో ఉన్నంత కాలం తన భర్త జైలు బయటే ఉంటాడు” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కుష్బూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.   


జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియామకం


ముంబైలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన కుష్బూ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ‘ది బర్నింగ్ ట్రైన్‌’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 2010లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. డిఎంకె పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియమించింది. ఈ ప‌ద‌విలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.  తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు.


Read Aso: నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు - షాకింగ్ విషయాలు వెల్లడించిన కుష్బూ