పశ్చిమబెంగాల్లో అడోనో వైరస్ కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం 9 రోజుల్లో 36 మంది పిల్లలు మరణించినట్టు అక్కడ ఆరోగ్య శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లల పైన ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నెలల వయసు ఉన్న శిశువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. ఫ్లూ వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్న పిల్లల్లోనే... అధికంగా ఈ వైరస్ కనిపిస్తోంది. రెండేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు త్వరగా ఈ వైరస్ బారిన పడుతున్నట్టు చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.
ఏంటి వైరస్?
అడెనో వైరస్ మనిషిలో చేరితే మెదడు వ్యవస్థ, మూత్ర నాళాలు, కళ్ళు, ఊపిరుతిత్తుల గోడలు, పేగులు వంటి వాటికి హాని కలిగిస్తుంది. ఇది అంటువ్యాధి. జలుబు ఎలా పక్కవారికి వ్యాపిస్తుందో ఈ శ్వాసకోశ వైరస్ కూడా సాధారణ జలుబులాగే ఇతరులకు తేలికగా వ్యాపిస్తుంది. జలుబుతో మొదలైన ఈ అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ పరిస్థితులకు దారితీస్తుంది. ఈ వైరస్ చర్మం, గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుంది. దగ్గు మరియు తుమ్ముల ద్వారా ఎదుట వ్యక్తులకు సోకుతుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
సాధారణ జలుబు, జ్వరం, గొంతు మంట, తీవ్రమైన బ్రాంకైటిస్, నిమోనియా, కళ్ళ కలక, కడుపునొప్పి వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన తరువాత కనిపిస్తాయి. వీటిని సాధారణంగా తీసుకోకూడదు.
చికిత్స ఉందా?
ఇంకా ఈ వైరస్ కు ఎలాంటి మందులను కనిపెట్టలేదు. సాధారణ జలుబు, జ్వరం, నిమోనియాకు వాడే మందులనే ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి రక్షణను తీసుకుంటున్నారో, ఈ వైరస్ విషయంలో కూడా అలాంటి రక్షణలే తీసుకోవాలని చెబుతోంది ఆరోగ్య శాఖ. చేతులతో కళ్ళు, ముక్కును తాకకుండా ఉండాలని, చేతులను చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు.
ఏ పిల్లలకైతే గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయో, వారిలో ఈ వైరస్ త్వరగా సోకుతోంది.అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్న వారిపై కూడా వైరస్ ప్రతాపం చూపిస్తోంది. అలాంటి పిల్లల ప్రాణాలను సులువుగా హరిస్తోంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్న పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ వైరస్ సులువుగా ప్రవేశిస్తుంది. కాబట్టి పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారన్ని ప్రత్యేకంగా తినిపించాలి. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, స్ట్రాబెర్రీ, నారింజ వంటివి రోజూ పెట్టాలి. క్యారెట్స్, బీన్స్, అల్లం వెల్లుల్లి, ఆకుకూరలతో వండిన వంటలను తినిపించాలి. కప్పు పెరుగు రోజూ ఇవ్వాలి.
Also read: ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఓట్ మీల్ వాటర్ తాగితే ఊహించని ప్రయోజనాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.