ఓట్స్ మన దేశంలో పండకపోయినా, వాటిలో ఉన్న ఆరోగ్య గుణాల కారణంగా ఇప్పుడు మన దగ్గర వాడుక పెరిగింది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటికి బదులు ఓట్స్ తినే వారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా అది మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి వరంగా మారింది. దీన్ని ఎంత తిన్నా ఆరోగ్యమే కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అందుకే ఓట్ మీల్ తినమని పోషకాహార నిపుణులు వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉదయానే పరగడుపున, ఖాళీ పొట్టతో ఓట్ మీల్ వాటర్‌ను తాగడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు చెబుతున్నారు. పోషకాహారం నిపుణులు వాటర్ తాగడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తున్నారు.


డిటాక్స్ చేస్తుంది 
ఓట్ మీల్ వాటర్ అనేది అద్భుతమైన డిటాక్స్ డ్రింక్. ఉదయం పూట ఖాళీ పొట్టతో ఈ ఓట్స్ నీటిని తీసుకుంటే శరీరంలోని వ్యర్ధాలు,  టాక్సిన్లు బయటికి పోతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఓట్స్ వాటర్ తాగడం వల్ల ఆ రోజంతా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.


బరువు తగ్గేందుకు 
అధిక బరువు బారిన పడినవారు ఆహారంలో ఓట్స్ వాటర్‌ను చేర్చుకుంటే ఎంతో లాభం. ఎందుకంటే ఇది పొట్టలోని కొవ్వును వేగంగా తగ్గించేందుకు సహాయపడుతుంది. ఓట్స్ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి అధిక ఆహారం తినే అవకాశం ఉండదు. ఉదయాన్నే ఓట్స్ వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ ఓట్స్ వాటర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.


కొలెస్ట్రాల్
గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలో కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉండాలి. ఓట్స్ వాటర్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది


జీర్ణవ్యవస్థకు
ఓట్స్లో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది ప్రేగు కలకలను సులభతరం చేసి మలబద్ధకం సమస్య రాకుండా అడ్డుకుంటుంది మన పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను కాపాడడంతో పాటు వాటి సంఖ్యను పెంచేందుకు సహకరిస్తుంది దీన్ని రోజు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి


మధుమేహులకు
మధుమేహ రోగులు రోజూ ఈ ఓట్ మీల్ వాటర్‌ని తాగడం చాలా ముఖ్యం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ అత్యధికంగా పెరగడాన్ని నివారిస్తుంది. ఓట్స్ వాటర్ తీసుకునే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహలు ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఓట్స్ వాటర్ వల్ల కూడా కలుగుతాయి.


ఎలా తయారు చేయాలి?
ఓట్స్ వాటర్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి రెండు గ్లాసుల నీటిలో ఒక చిన్న కప్పు ఓట్స్‌ను వేసి నానబెట్టాలి. తర్వాత ఉదయాన్నే ఆ నీళ్లతో పాటు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అది నీళ్లలాగా ఉంటుంది. ఒక గ్లాసులో ఆ మిశ్రమాన్ని వేసుకొని, కాస్త తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. దాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ పొట్టతో తాగాలి. 


Also read: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తపడాలి









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.