టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది డిసెంబర్ 23న ‘ధమాకా’ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తర్వాత ఈ  ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించి అలరించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ ఏడాది సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఇక మాస్ మహరాజ్ రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌ను మార్చి 6న ఉదయం విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇక ‘రావణాసుర’ టీజర్ విషయానికొస్తే.. టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా కనిపిస్తుంది. టీజర్ ను చాలా బాగా కట్ చేశారు. ప్రారంభంలో క్రైమ్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చూపించారు. రవితేజ పాత్రను కూడా వైలెంట్ గానే చూపించారు. అంతేకాకుండా సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారా అనే సందేహం కూడా కలగకమానదు. మూవీలో హీరో సుశాంత్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. రవితేజకు ధీటుగా ఆయన పాత్రను కూడా చూపించారు మేకర్స్. టీజర్ లో డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ చెప్పిన ‘‘సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు, ఈ రావణాసుడ్ని దాటి వెళ్లాలి’’ అనే డైలాగ్ బాగుంది. అయితే టీజర్ రవితేజను చాలా వరకూ నెగిటివ్ పాత్రలోనే చూపించారు. అయితే నిజంగా సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుంది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.


ఇక  టీజర్ లో విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. టీజర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.  ఈ సినిమాలో రావు రామేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా లతో పాటు అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హర్ష వర్థన్ అలాగే భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పటికే రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమాకు ఆయన సంగీతం అందిచారు. ఆ మూవీలో పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి స్పందన వచ్చింది. ఆ మూవీ పాటలు చాలా రోజులు ట్రెండ్ అయ్యాయి కూడా. దీంతో ఈ సినిమా పై కూడా ఆసక్తి నెలకొది.  అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.