బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘బేబీ’ మూవీపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ ను ప్రోత్సహించే విధంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిలో డ్రగ్స్ ఎలా వినియోగించాలో చూపించారని కమిషనర్ అన్నారు. ఆ సీన్స్‌ ని ప్రత్యేకంగా ప్రదర్శించి మరీ చూపించారు. అలాంటి దృశ్యాలను చూపించినందుకు గానూ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్లు సీపీ తెలిపారు. దీనిపై తాజాగా దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. 


‘బేబీ’ సినిమాలో డ్రగ్స్ వినియోగించే సన్నివేశాలు పెట్టడంపై వివరణ కోరుతూ పోలీసులు ఒక నోటీస్ ఇచ్చినట్లు సాయి రాజేష్ తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌ తో సహా సీవీ ఆనంద్‌ ను కలిసిన దర్శకుడు.. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసాడు. ఇందులో సాయి రాజేష్ మాట్లాడుతూ..''సినిమాలో సీత, వైష్ణవిల మధ్య గంజాయి తాగే ఒక సీన్ కి యూట్యూబ్ లో చట్టబద్ధమైన హెచ్చరిక లేదు అనే దానిపై పోలీసులు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు. ఇంత ఇంటెన్స్ గా డ్రగ్స్ ని వినియోగించే విధంగా సినిమాలు తీయొద్దని సీపీ ఆనంద్ సూచించారు. దానివల్ల యూత్ కి రాంగ్ మెసేజ్ వెళ్తుంది.. ఈ విషయాలను మీరు టాలీవుడ్ లోని డైరెక్టర్స్ రైటర్స్ యాక్టర్స్ కు తెలియజేయాలని ఆయన చెప్పారు'' అని తెలిపారు. 


''కథలో భాగంగానే ఆ సన్నివేశంలో డ్రగ్స్‌ సీన్‌ పెట్టాల్సి వచ్చిందని నేను వివరణ ఇచ్చా. రాంగ్ ఫ్రెండ్ షిప్స్ వల్ల ఒక బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి లైఫ్ ఎలా పాడైపోయింది.. డ్రగ్స్, ఆల్కహాల్ కు అలవాటు పడటం వల్ల జీవితంలో ఏమేమి కోల్పోయిందనేది 'బేబీ' కథ అని చెప్పాను. దానికి ఆయన కన్విన్స్ అయ్యారు. యూట్యూబ్ లో 'చట్టబద్ధమైన హెచ్చరిక' లేదు. కానీ, సినిమాలో ఓటీటీలో ఉంది. వార్నింగ్ వెయ్యకపోతే అసలు క్యూబ్ యాక్సెప్ట్ చెయ్యదు. యూట్యూబ్ కంటెంట్ కి సెన్సార్ ఉండదు కాబట్టి, ఆ వార్నింగ్ తీసేసి అప్లోడ్ చేస్తారు. నిజానికి దానితో దర్శక నిర్మాతలకు సంబంధం ఉండదు. అది ఆడియో కంపెనీలు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని కమిషనర్ కు వివరించాను'' అని సాయి రాజేష్ చెప్పారు. 


''కథలో డ్రగ్స్ సీన్లు రాసేటప్పుడు కానీ, తీసేటప్పుడు కానీ, వాటిని ఒక ఫ్యాషన్ గా చూపించకుండా.. ఒక బాధ్యతగా డ్రగ్స్ కారణంగా ఎలా చెడిపోతారు అనేది చూపించాలని ఆయన కోరారు. ఒకవేళ సినిమాలో అలాంటి సీన్స్ కచ్చితంగా పెట్టాల్సి వస్తే బ్లర్ వేసి చూపించండి. సామాజిక బాధ్యతతో అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా సినిమాలు తియ్యాలని అడ్వైజ్ ఇచ్చారు. అంతేకానీ ఇక్కడ మా మీద కేసులు ఏమీ లేవు. ఇది కేవలం అడ్వైజరీ నోటీస్ మాత్రమే'' అని దర్శకుడు చెప్పుకొచ్చారు. 


Also Read: టాలీవుడ్‌లో మళ్లీ మొదలైన వాయిదాల పర్వం


కాగా, మాదాపూర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న, వినియోగిస్తున్న ముఠాను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేశాం. బెంగుళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించాం. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మరీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా కొందరు నైజీరియన్లు ఇక్కడే ఉన్నారు. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌ వ్యక్తి ఉన్నట్లు గుర్తించాం. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు మా విచారణలో తేలింది. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావును కూడా అరెస్ట్ చేశాం. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేసేలా ‘బేబీ’ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ఆ సినిమాలో ఉన్నట్లే కనిపించాయి. ఇలాంటి సన్నివేశాలు తీయొద్దని సినీ ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ‘బేబీ’ మూవీ నిర్మాతలకు కూడా నోటీసులు ఇస్తాం. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది’’ అని సీవీ ఆనంద్‌ తెలిపారు.


Also Read: బేబీ ఫుల్ బిజీ.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న తెలుగమ్మాయి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial