తమిళ నాట పలువురు స్టార్ హీరోలకు ఎదురు దెబ్బ తగిలింది. ధనుష్, శింబు, విశాల్, అథర్వలకు నిర్మాతల సంఘం రెడ్ కార్డు జారీ చేసింది. గతంలో వీరి ప్రవర్తన కారణంగా కొందరు నిర్మాతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్మాతల సంఘం తెలిపింది.
తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తేనండాల్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. 2018లోనే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. తెలుగు హీరో నాగార్జున ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో నిర్మాతలకు ఎంతో నష్టం వాటిల్లింది.
ప్రస్తుతం విశాల్ ‘మార్క్ ఆంటోని’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్... 2017లో శింబుతో ‘అన్బానవన్ అసరదావన్ అడంగదావన్’ అనే చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే శింబు మధ్యలో వెళ్లిపోయారు. శింబు 76 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండగా... కేవలం 38 రోజులు మాత్రమే షూట్ చేశాడని, ఈ కారణంగా తమకు ఎంతో నష్టం వచ్చిందని ఆ సినిమా నిర్మాత మైకేల్ రాయప్పన్ ఆరోపించారు.
అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశాడని నటుడు విశాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా అతనికి కూడా రెడ్ కార్డును ఇష్యూ చేశారు. విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ రిలీజ్ ఆపివేయాలని లైకా ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఇటీవలే కోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు సినిమా విడుదలకు అనుమతిని ఇచ్చింది.
2018లో ఎట్సెట్రా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అథర్వ హీరోగా ‘సెమ్మ బోత ఆగతే’ అనే సినిమాను మతియళగన్ నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. దీంతో అదే నిర్మాతకు మరో సినిమా చేస్తానని అథర్వ మాటిచ్చారు. కానీ ఇంతవరకు సినిమా చేయలేదు. దీని కారణంగా అథర్వకు కూడా నిర్మాతల సంఘం రెడ్ కార్డు జారీ చేసింది.
దీనిపై ఆయా నటులు ఇంకా స్పందించలేదు. ఈ లిస్టులో ఉన్న అందరు హీరోల చేతిలోనూ ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులే ఉన్నాయి. అలాగే త్వరలో మరింత మంది నటులకు రెడ్ కార్డులు జారీ అవుతాయని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.