మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన సంగీత దర్శకుడాయన. తన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకొని మన దేశానికే గర్వకారణంగా నిలిచారు. అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రెహ్మాన్.. బాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. ఏ ఇండస్త్రీలోనైనా ఫేమ్ వచ్చిన తర్వాత బాంబే వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రెహమాన్ కు కూడా అలాంటి అవకాశమే వచ్చిందట. కానీ ముంబైలో స్థిరపడటానికి సంకోచించారట. దీనికి గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


రెహమాన్ మాట్లాడుతూ, బాలీవుడ్ డైరెక్టర్ సుభాష్ ఘై తనను బాంబేకి షిఫ్ట్ అవ్వాలని సూచించారని తెలిపారు. అయితే అప్పుడు ముంబైలో 'అండర్ వరల్డ్ మాఫియా కల్చర్' పీక్స్ లో ఉన్నందున అది సరైన ఆప్షన్ కాదని భావించినట్లు చెప్పారు. చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆఫర్ ఇచ్చారన్నారు. అమెరికాలో ఇల్లు తీసుకున్నప్పటికీ, అక్కడే ఉండిపోవాలని ఎప్పుడూ ఆలోచించలేదని రెహమాన్ తెలిపారు. 


“1994లో ఆంధ్ర ప్రదేశ్‌ కి చెందిన ఒక పెద్ద నిర్మాత నేను చెన్నై నుంచి వచ్చేస్తే బంజారాహిల్స్‌ లో పెద్ద స్థలం ఇస్తానని అన్నారు. నేను ఆయన్ని చూసి నవ్వాను. ఆ తర్వాత, నేను హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు, సుభాష్ ఘాయ్ నన్ను హిందీ నేర్చుకోమని చెప్పారు. ఎందుకంటే భాష తెలిసి ఉంటే అక్కడి ప్రజలు నన్ను ప్రేమిస్తారు. కానీ అది ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా సంస్కృతి రాజ్యమేలుతున్న సమయం కాబట్టి నేను దానిని పరిగణనలోకి తీసుకోలేదు'' అని రెహమాన్ చెప్పారు. 


“కొన్ని సంవత్సరాల తరువాత, నేను ఇంగ్లండ్‌లో పని చేశాను. అప్పుడు నా భార్య యూకేలో మూడు నెలలు మాత్రమే ఉండగలిగింది. భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకునేది. ఆ తర్వాత యూఎస్ వచ్చి అందరికీ నచ్చినట్లు మేము అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. కానీ ఈసారి కూడా అందరం తిరిగి ఇండియాకి వచ్చేశాం'' అని తెలిపారు. తాను సంపాదించుకున్న డబ్బు, కీర్తి, గౌరవం.. ఏదైనా తన పిల్లలు సక్రమంగా నిర్వహించకపోతే అదృశ్యమవుతుందని రెహమాన్ చెప్పాడు. అందుకే ఫైనాన్సియల్ విషయాలు గురించి, కష్టనష్టాల గురించి వారికి చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడనని అన్నారు. 


Also Read: 'తమ్ముడు' పక్కన పెట్టేసిన రీమేక్ తో 'అన్నయ్య' చేతికి!


మరో ఇంటర్వ్యూలో RRR ఆస్కార్ సాధించడం గురించి రెహమాన్ మాట్లాడుతూ.. ''బాలీవుడ్ అని పిలుచుకునే హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కటే ఉందని ప్రపంచం నమ్ముతున్నప్పుడు, 'నాటు నాటు' అనే తెలుగు పాట ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాలీవుడ్ అనే పదాన్ని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. ఎందుకంటే అది హాలీవుడ్ నుండి వచ్చిన చాలా సౌకర్యవంతమైన ఉత్పన్నమైన పదం. ఎవరైనా ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు నేను సరిదిద్దుతూ ఉంటాను” అని అన్నారు.


గతంలోనూ అనేక సందర్భాల్లో బాలీవుడ్ పై రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఆఫర్లు రాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ''బాలీవుడ్‌లో ఓ గ్యాంగ్‌ నా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ‘దిల్‌ బేచారా’ డైరెక్టర్ ముఖేశ్‌ చబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు పాటలు ఇచ్చాను. రెహమాన్‌ వద్దకు వెళ్లొద్దని చాలా మంది చాలా రకాలుగా ఆయనకు చెప్పారట. మంచి సినిమాలు నా వరకు ఎందుకు రావట్లేదో అప్పుడే అర్థమైంది. ఓ గ్యాంగ్‌ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోందని తెలిసింది. నా నుంచి మరిన్ని పాటలు రావాలని జనాలు కోరుకుంటున్నారు. కానీ కొందరు నన్ను ఆ పని చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. అయినా ఫర్వాలేదు. నేను విధిని, దేవుణ్ని నమ్ముతాను కాబట్టి నా వద్దకు వచ్చిన సినిమాలు చేస్తూ, అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాను. మంచి సినిమాలతో నా వద్దకు రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను’’ అని రెహమాన్‌ అన్నారు.


Also Read: అర్థరాత్రి అప్డేట్ - ఇప్పుడిదే ఇండస్ట్రీలో నయా ట్రెండ్, ఎందుకలా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial