Amitabh Bachchan Hand Surgery: సినిమా షూటింగ్స్‌లో యాక్టర్లకు చిన్న చిన్న గాయాలు అవ్వడం సహజం. కానీ కొన్ని గాయాలు సర్జరీల వరకు వెళ్తాయి. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు కూడా అదే జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ చేతికి సర్జరీ అయ్యింది. అప్పటినుండి తాను పాల్గొన్న షూటింగ్స్ అన్నింటిలో కట్టుతో కనిపిస్తున్నారు. ఆ చేతి సర్జరీ గురించి తాజాగా తన బ్లాగ్‌లో రివీల్ చేశారు బిగ్ బి. కానీ అది షూటింగ్‌లో జరిగిన గాయం వల్ల జరిగిందా లేదా ఇంకేమైనా కారణం ఉందా అని మాత్రం రివీల్ చేయలేదు. దీంతో పాటు తాజాగా అక్షయ్ కుమార్, సూర్యతో కలిసి షూట్ చేసిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.


ఫోటో కమ్ మీట్ షూట్..
తాజాగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సూర్య కలిసి ఒక క్యాంపెయిన్ యాడ్‌లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ గురించి అమితాబ్ బచ్చన్.. తన బ్లాగ్‌లో తెలిపారు. ‘ప్రస్తుతం ఐఎస్‌పీఎల్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఓనర్లు, మెంబర్లు అందరూ ఫోటోల్లో కనిపించాలని నిర్ణయించుకున్నారు. అందుకే తాజాగా ఒక ఫోటో కమ్ మీట్ షూట్ జరిగింది. సాయంత్రం సమయాల్లో అలా త్వరత్వరగా షూట్ అయిపోయింది. చాలా ఎంజాయ్ చేశాం. ఐఎస్‌పీఎల్ ఓనర్లలో అక్షయ్ కుమార్ కూడా ఒకడు. తనకు నా చేతికి అయిన సర్జరీ గురించి వివరించాను’ అని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. దీంతో అమితాబ్ చేతికి సర్జరీ అయిన విషయం బయటపడింది. కానీ అసలు సర్జరీ ఎందుకు జరిగింది అనే విషయాన్ని మాత్రం ఆయన రివీల్ చేయలేదు.






సౌత్ ఫేవరెట్ సూర్యను కలిశాను..
ఇక ఐఎస్‌పీఎల్ ప్రమోషన్ షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సూర్య మాత్రమే కాకుండా హృతిక్ రోషన్ కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబే రివీల్ చేశారు. ‘హృతిక్ తన షూటింగ్‌ను పూర్తి చేసుకొని తన తరువాతి పనికి వెళ్లిపోయాడు. మేము మా షూట్ కోసం రెడీ అవుతున్నాం. మాతో పాటు సౌత్ ఫేవరెట్ స్టార్ సూర్య కూడా ఉన్నాడు. మరోసారి తనను కలవడం చాలా సంతోషంగా అనిపించింది. మరోసారి నాకు తన సినిమా ఎంత నచ్చిందో చెప్పే అవకాశం దొరికింది. అది తండ్రి, కొడుకుల మధ్య అనుబంధానికి సంబంధించిన సినిమా’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు. ఈ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అమితాబ్.. తన బ్లాగ్‌లో షేర్ చేశారు. అంతే కాకుండా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశారు.






ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్..
ఐఎస్‌పీఎల్ అంటే ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’. ఇది ఇండియాలోనే మొదటిసారి స్టేడియం లోపల టెన్నీస్ బాల్ టీ10 క్రికెట్ టోర్నమెంట్. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి క్రికెట్ లీగ్స్ జరగలేదు. ఈ టోర్నమెంట్‌లో గెలవడం కోసం ఇండియాలోని ప్రతీ రాష్ట్రం నుండి ప్లేయర్స్ పోటీపడతారు. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఓనర్ కూడా ఉంటారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే ముంబాయ్ టీమ్‌కు అమితాబ్ బచ్చన్ ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్చ్ 2 నుండి 9 వరకు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అమితాబ్‌తో పాటు సూర్య, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రామ్ చరణ్ కూడా ఈ టోర్నమెంట్‌లో ఓనర్లుగా వ్యవహరిస్తున్నారు.


Also Read: ‘ధర్మం కోసం నిలబడ్డ వారే గెలుస్తారు’ - నెగిటివిటీపై ప్రశాంత్ వర్మ పోస్టు!