2024 సంక్రాంతి సందర్భంగా బరిలోకి దిగిన ‘హనుమాన్’ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. థియేటర్ల సమస్య, డిమాండ్‌కు తగ్గట్లు థియేటర్లు దొరక్కపోవడం ఇలా ఎన్నో రకాలుగా ‘హనుమాన్’ వార్తల్లో ఉంటూ వస్తుంది. కానీ వీటన్నిటినీ దాటి పెద్ద విజయాన్ని సాధించింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచే దిశగా సాగిపోతుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందంపై నెలకొన్న నెగిటివిటీ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘మా టీమ్ చుట్టూ ఎక్కువగా ప్రొపగాండా కనిపిస్తుంది. మాకు సంబంధించి ఫేక్ అకౌంట్లు కూడా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు. నిన్నటి భోగి మంటల్లో డిజిటల్ చెత్తను అందులో వేయడం మర్చిపోయినట్లు ఉన్నారు. అయితే సినిమా ప్రియులు తమ సపోర్ట్‌ను హనుమాన్‌కు ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞుడనై ఉంటాను. ‘ధర్మం కోసం ఎవరు నిలబడతారో వారు ఎప్పుడూ గెలుస్తారు’ అనేది నేను నమ్ముతాను. కానీ చివరికీ మా హనుమాన్ గాలిపటం ఈ సంక్రాంతికి ఎంత నెగిటివిటీ కిందకు లాగుతున్నా అంతకంతకూ పైకి ఎగరడానికి సిద్ధం అయింది.’ అని తన పోస్టులో పేర్కొన్నారు.
సూపర్ హీరో జోనర్లో వచ్చిన 'హనుమాన్' సినిమా ముందు రోజు వేసిన ప్రీమియర్స్ నుంచే బ్లాక్‌బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తక్కువ థియేటర్లోకి వచ్చిన 'హనుమాన్' భారీ ఆక్యుపెన్సీని దక్కించుకుంది. ఇక కలెక్షన్స్‌లో కూడా దూకుడును అమాంతం పెంచుతూ పోతుంది. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ‘హనుమాన్’ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తెలుగు సూపర్ హీరో దూసుకుపోతున్నాడు.
కంటెంట్ బాగుంటే హిందీ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండ ఏ సినిమానైనా ఆదరిస్తారు. ఇది ఇప్పుడు మరోసారి రుజువైంది. మన తెలుగు సినిమాలైన బాహుబలి, సాహో, కేజీఎఫ్, దసరా, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్లు అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు ‘హనుమాన్’ హిందీ వెర్షన్ కూడా బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమా అక్కడ మరిన్ని వసూళ్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ‘హనుమాన్’ ఫస్ట్‌డే రూ. 2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా... రెండ రోజుకు 88 శాతం పుంజుకుని రూ. 4.05 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ పిండితుల తెలిపారు. మొత్తం రెండు రోజుల్లో హనుమాన్ హింది వెర్షన్ రూ. 6.2 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లెక్కలు మరికాసేపట్లో బయటకు వస్తాయి. బాలీవుడ్ అవైయిటెడ్ మూవీ ‘ఫైటర్’ విడుదలయ్యే వరకు ‘హనుమాన్’ దూకుడు కొనసాగేలా ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రెండ్ ఇలాగే కొనసాగితే హనుమాన్ ఫైనల్ రన్‌లో రూ. 50 కోట్ల నుం రూ.100 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందంటున్నారు.