Traditional Food Recipes : పండుగల సమయంలో పిల్లలు ఇంటికి వస్తారు. వారికి నచ్చింది వండి పెట్టేస్తారు. అయితే వారు పండుగ నుంచి ఉద్యోగాలకు, చదువుకునేందుకు వెళ్లేప్పుడు వారితో కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపకపోతే ఎలా? పైగా సంక్రాంతి నుంచి తిరిగి సిటీకి వెళ్లిపోతున్నారంటే కచ్చితంగా వారు తినడానికి ఏదొకటి తెస్తారని మిత్రులు కూడా ఎదురు చూస్తుంటారు. లేదంటే తల్లి ప్రేమను గుర్తు చేసుకుని పిల్లలే వాటిని తింటారు. అలా మీరు పిల్లలకోసం ఏమైనా వండాలనుకుంటే మీరు రవ్వ లడ్డూలను చేసేయొచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువ సమయం పట్టవు. అంతేకాకుండా తక్కువ సమయంలోనే వీటిని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బొంబాయి రవ్వ - 2 కప్పులు


పంచదార - ఒకటిన్నర కప్పు


యాలకులు - 5


కొబ్బరి తురుము - 2 కప్పులు


నెయ్యి - పావు కప్పు


జీడిపప్పులు - 20


ఎండు ద్రాక్ష - 10


తయారీ విధానం


పచ్చి కొబ్బరి కోసం 4 చిప్పలు తీసుకుంటే రెండు కప్పుల కొబ్బరి తురుము వస్తుంది. పచ్చికొబ్బరి నేరుగా తినేసే అలవాటు లేనివారికి ఈ పని అప్పజెప్పి.. రెండు కప్పుల కొబ్బరి తురుమును సిద్ధం చేసుకోండి. యాలకులను దంచి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పంచదారను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. పంచదార మరి పొడిగా కాకుండా కాస్త బరకగా ఉంటేనే లడ్డూలు బాగుంటాయి. ఇప్పుడు రవ్వలడ్డూను తయారు చేసుకునేందుకు స్టౌవ్ మీద ఓ మందపాటి కడాయిని పెట్టండి. స్టౌవ్ వెలిగించి దానిలో నెయ్యి వేసి వేడి చేయండి.


నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. అవి పూర్తిగా వేగిన తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త నెయ్యి ఉంటుంది. దానిలోనే బొంబాయి రవ్వ వేసి బాగా వేయించండి. మీడియం మంట మీద కాస్త వేగనివ్వండి. స్టౌవ్ అలాగే వదిలేసి పక్కకు వెళ్లిపోతే రవ్వ మాడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టౌవ్ దగ్గరే ఉండే దానిని కదుపుతూ వేయిస్తే మంచి రవ్వ మంచి రంగు వస్తుంది. 


రవ్వ బాగా వేగిన తర్వాత దానిలో పచ్చికొబ్బరి తురుము వేసి వేయించండి. కొబ్బరి మంచి వాసన వచ్చే వరకు రవ్వతో కలిపి వేయించండి. కొబ్బరి తురుములోని నీరు రవ్వను మాడిపోకుండా కాపాడుతుంది. ఇలా వేయించుకున్న రవ్వ-కొబ్బరి మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పొడిని వేసి బాగా కలపాలి. రవ్వ-కొబ్బరి మిశ్రమంలో పంచదార బాగా కలిసేవరకు తిప్పండి. కాస్త నెయ్యి వేసి మరోసారి కలపండి. ఇప్పుడు దానిలో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ జత చేసుకోవచ్చు. ఇలా అన్ని పూర్తిగా కలిసే వరకు తిప్పి స్టవ్​ను ఆపేయండి. 


రెడీ చేసుకున్న మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే మీరు లడ్డూగా చుట్టేసుకుంటే మంచిదే. కాస్త చల్లారక లడ్డూలు చుట్టుకోవాలి అనుకుంటే పాలను ఉపయోగించి లడ్డూగా చుట్టుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూ రెసిపీ రెడీ. ఈ రకంగా మీరు లడ్డూలు తయారు చేసుకుంటే ఓ 20 రోజులు పాటు చక్కగా నిల్వ ఉంటాయి. కాబట్టి ఇంటిల్లిపాది హాయిగా తినేయొచ్చు. వేరే ఊళ్లల్లో చదువుకుంటున్న, జాబ్ చేస్తున్న పిల్లలకు తయారు చేసి పంపించేయొచ్చు. 


Also Read : సంక్రాంతి స్పెషల్ సేమ్యా కేసరి.. కమ్మగా వండుకుని.. హాయిగా తినేయండి