Sankaranthi Special Traditional Recipe : ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా, పూజలు ఉన్నా మీరు త్వరగా, ఈజీగా, టేస్టీగా ఉండే రెసిపీ చేయాలనుకుంటే సేమ్యా కేసరి బెస్ట్ ఆప్షన్. దీనిని తయారు చేయడానికి పెద్దగా ఇతర పదార్థాలు అవసరమేమి ఉండదు. దాదాపు ఇంట్లో ఉండే పదార్థాలతోనే టేస్టీ కేసరీ తయారు చేయవచ్చు. దీనిని మీరు తయారు చేయడంలో కొన్ని సూచనలు పాటిస్తే దీని రుచి మరింత అద్భుతంగా మారుతుంది. సంక్రాంతి(Makara Sankranthi 2024) సమయంలో పనులతో బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీలను తయారు చేసుకుంటే ప్రసాదంగానూ, స్వీట్​గానూ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి దీనిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


సేమ్యా - 2 కప్పులు


నీరు - 2.5 కప్పులు 


చక్కెర - 1 కప్పు


కుంకుమ పువ్వు - చిటికెడు


యాలకుల పొడి - అర టీస్పూన్


నెయ్యి - పావు కప్పు


జీడిపప్పు - 10


ఎండుద్రాక్ష - 10


తయారీ విధానం


ముందుగా స్టవ్ వెలిగించి దానిమీద గిన్నె పెట్టి దానిలో నీళ్లు పోసి మరిగించండి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి.. దానిపై కడాయి ఉంచి.. రెండు స్పూన్ల నెయ్యి వేయండి. అది వేడి అయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్షలు వేసి.. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత కడాయి నుంచి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో సేమ్యాలు వేసి రోస్ట్ చేయండి. మీడియం మంట మీద ఓ 5 నిముషాలు రోస్ట్ చేయండి. సేమ్యాలు బాగా ఎర్రగా మారాల్సిన అవసరం లేదు. అలా అని వాటిని అలా వదిలేసి పక్కకి వెళ్లిపోతే మాడిపోతాయి కాబట్టి కాస్త దగ్గర ఉంటూనే బాగా రోస్ట్ చేసుకోండి. 


మరుగుతున్న నీటి స్టౌవ్ ఆపేసి.. రోస్ట్ అవుతున్న సేమ్యాల కడాయిలో ఆ నీటిని వేసేయండి. ముద్దలుకాకుండా బాగా కలపాలి. ఆ తర్వాత సేమ్యాను బాగా ఉడకినవ్వాలి. సేమ్యాలు పూర్తిగా నీటిని పీల్చుకుని చిక్కగా మారేవరకు దానిని కదిలిస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి సేమ్యాలలో పలుకు ఏమాత్రం లేకుండా ఉడకనివ్వాలి. అలా ఉడికిన సేమ్యాలలో చక్కెర వేసి బాగా కలపండి. మీరు పంచదారకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. చక్కెర పూర్తిగా కరగనివ్వాలి. పంచదార వల్ల మిశ్రమం కాస్త ద్రవంగా మారుతుంది. 


మిశ్రమాన్ని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. చక్కెర పూర్తిగా కరిగి.. పలుకులుగా మారుతున్న సమయంలో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. కుంకుమపువ్వు కేసరి మంచి బంగారు రంగును ఇస్తుంది. అంతేకాకుండా కేసరి రుచిని పెంచుతుంది. మీరు కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్షాలు వేసి స్టవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి కేసరి రెడీ. దీనిని మీరు వేడిగా తినొచ్చు. మరుసటి రోజుకు కూడా ఇది బాగానే ఉంటుంది. అయితే దీనిని నేరుగా తినేయొచ్చు లేదా వెనిలా ఐస్​క్రీమ్​తో కూడా ఆస్వాదించవచ్చు. 


Also Read : భోగి స్పెషల్ చక్కెర పొంగలి.. నైవేద్యంగా పెట్టాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి