Ram Madhav on Ayodhya Ram Mandhir: అమలాపురం: రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు చెప్పడం వాళ్లపార్టీ నిర్ణయం అన్నారు బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి వారణాశి రామ్‌ మాధవ్‌ (Ram Madhav). దీనిపై తాము అభిప్రాయం చెప్పనక్కర్లేదని, ఇదంతా రాజకీయం, ఎన్నిలక కోసం చేస్తున్నారన్న చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు అన్నారు. ఈ వ్యాఖ్యలు ద్వారా మహత్తరమైన జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ (Congress) వాళ్లే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజకీయం కాదు అని చెప్పడం కోసమే అన్ని పార్టీ వాళ్లను, అన్ని వర్గాల ప్రజలను, ఉద్యోగస్తుల నుంచి సామాన్య ప్రజల వరకు పిలవడం జరిగిందన్నారు. రాజకీయం చేయదలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు, కమ్యునిష్టులకు ఆహ్వానం పంపించి ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ వాళ్లు ఏ వైఖరితో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఉండే నాయకులు, ఇతర కార్యకర్తలు, ఇతర పార్టీల్లో ఉన్నవారు దేశంలో అనేక మంది ఈ రోజు రామమందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే స్వీకరించడం లేదన్నారు. సీతారాం ఏచూరి కమ్యూనిష్టు పార్టీ వారే కాబట్టి వారి ఆలోచన విధానం వేరుగా ఉండవచ్చు అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ జనహిత భవనాన్ని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామితో కలిసి రామ్‌ మాధవ్‌ ప్రారంభించారు.

 

ధర్మమంటే ఒక మతం కాదు... శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి 

ధర్మమంటే ఒక మతం కాదని, మనిషి తాను ఆచరించాల్సిన పనుల పట్ల సమగ్రమైన అవగాహన కల్పించడమేనని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా ఆవిష్కరించిన జనహిత భవనం ద్వారా నూతన ఒరవడిని అందించగలదని ఆయన ఆకాంక్షించారు. అమలాపురం నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ జనహిత భవనాన్ని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. 16 మండలాల కోసం అమలాపురంలో సేవా భారతి రాష్ట్రీయ సేవా సంస్థ ద్వారా జనహిత భవనాన్ని ప్రారంభించిందని, ఇది కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా దేశభక్తిని, ధర్మచింతన ఎలా పెంపొందిచాలన్న అవగాహన కోసమే అన్నారు.