Sankaranthi Special Traditional Recipe : తెలుగు ప్రజలు సంక్రాంతిని ఎంతో భక్తి, శ్రద్ధలతో చేసుకుంటారు. ముఖ్యంగా భోగి రోజున పెద్ద పెద్ద మంటలు వేసి.. ఇంట్లోని పాత వస్తువులను దానిలో వేసి కాల్చేస్తారు. మనలోని చెడును ఆ మంటల్లో వేసి.. కొత్త శకానికి ప్రారంభించాలి అనేదానిని ఇది గుర్తు చేస్తుంది. రైతులు ఏడాది పొడవునా వరి పంటలను పండించడానికి శుభసూచికంగా.. అప్పుడే కోసిన బియ్యాన్ని పొంగలికి ఉపయోగిస్తారు. అయితే భోగి మంటల మీద చక్కెర పొంగలిని వండడంతో సంక్రాంతి పండుగ శోభ ప్రారంభమవుతుంది. అలా భోగి మంటల మీద వండిన పొంగలినే నైవేధ్యంగా పెడతారు. అందరికీ మంటల మీద వండుకోవడం కుదరదు కాబట్టి.. కొందరు స్టౌవ్ ఉపయోగించి దీనిని వండుతారు. అయితే ఈ చక్కెర పొంగలిని ఏ విధంగా వండాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


పెసరపప్పు - పావు కప్పు


బియ్యం - ముప్పావు కప్పు


పంచదార - ముప్పావు కప్పు


బెల్లం - అర కప్పు (తురిమినది)


ఎండు ద్రాక్ష - 10


జీడిపప్పు - 10


ఎండు కొబ్బరి - పావు కప్పు 


పచ్చకర్పూరం - కొంచెం


యాలకుల పొడి - చిటికెడు 


తయారీ విధానం


ముందుగా భోగి మంట మీద కడాయి పెట్టి దానిలో పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. మంట ఎక్కువగా ఉంటే కాస్త పుల్లలను పక్కకు లాగి పచ్చివాసన పోయేవరకు, దోరగా కనిపించేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు లోతైన గిన్నె తీసుకుని దానిలో పావు కప్పు వేయించిన పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యం వేయాలి. దానిలో రెండు కప్పుల నీటిని పోయాలి. దీనిని పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. అన్నం పొడి పొడిలాడేవరకు ఉడికేలా చూసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే బాగోదు. ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు పాకం కోసం మరోగిన్నె తీసుకుని దానిలో చక్కెర, బెల్లం వేసి.. అరకప్పు నీరు పోసి.. బెల్లం, చక్కెర కరిగేవరకు మరగనివ్వాలి. రెండూ పూర్తిగా కరిగితేనే పొంగలి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దానిని ఓ కడాయిలోకి వడకట్టాలి. ఎందుకంటే బెల్లం లేదా చక్కెరలో ఉండే రాళ్లు పొంగలిలోకి చేరకుండా ఉంటాయి. ఇప్పుడు బెల్లం, చక్కెర మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి తీగపాకం వచ్చేవరకు తిప్పాలి. పాకం పట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. 


తీగపాకం రెడీ అయిందనుకున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దానిలో వేసి బాగా కలపాలి. యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి పాకం అడుగంటకుండా పొంగలిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఓ చిన్నె కడాయి పెట్టి దానిలో నెయ్యి వేసి.. ఎండు కొబ్బరి ముక్కలను దానిలో వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఇది పొంగలికి మంచి టేస్ట్​ని యాడ్ చేస్తుంది. వేగిన కొబ్బరిని పొంగలిలో వేయండి. అలాగే జీడిపప్పు, కిస్​మిస్​లను మాడిపోనివ్వకుండా వేయించుకుని వాటిని కూడా పొంగలిలో వేసేయాలి. అంతే నైవేద్యానికి చక్కెర పొంగలి రెడీ అనమాట. కొందరు నైవేద్యం కదా అని పచ్చకర్పూరం ఎక్కువగా వేసేస్తారు. అలా వేస్తే మీరు సరిగ్గా తినలేరు. కాబట్టి వీలైనంత తక్కువగా వేయాలని గుర్తించుకోండి. 


Also Read : మొదటిసారి అరిసెలు చేస్తున్నారా? ఇంట్లోనే ఇలా టేస్టీగా వండేయండి