Andhra Special Ariselu Recipe : సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఊళ్లల్లో హడావిడులతోపాటు వంటగదులు కూడా కలర్​ఫుల్​గా మారిపోతాయి. అలాంటి వంటింట్లో అరిసెలు లేకుంటే పండుగ పూర్తి అవుతుందా? అస్సలు కానే కాదు. ముఖ్యంగా సంక్రాంతి(Sankranthi 2024) సమయంలో అరిసెలు చాలా ఫేమస్. సంప్రదాయ రెసిపీలలో దీని గురించి ప్రత్యేకమైన చర్చ ఉంటుంది. అయితే అరిసెలు చేయడం చాలా కష్టమని.. దానిని తక్కువ మొత్తంలో చేయలేము అనుకుంటారు. అలా అనుకునేవారు ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయితే పండుగ సమయంలో మీరు అరిసెలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రయత్నాలు ఎప్పుడు ఎక్కువ మొత్తంలో చేయకూడదు కాబట్టి.. తక్కువ మొత్తంలో అరిసెలు ఎలా తయారు చేయవచ్చో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బియ్యం - కప్పు


బెల్లం - కప్పు


నీరు - 2 కప్పులు


యాలకుల పొడి - అర టీస్పూన్


నెయ్యి - 2 టేబుల్ స్పూన్


నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడనంత


నువ్వులు - గార్నిష్ కోసం 1 టీస్పూన్


బియ్యం పిండి కోసం..


అరిసెల కోసం బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు మూడు సార్లు కడిగి నీటిని వడకట్టాలి. పది నుంచి పదిహేను నిమిషాలు వాటిని అలాగే ఆరనివ్వాలి. అనంతరం బియ్యాన్ని గ్రైండ్ చేసుకోండి. పిండిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో అరిసెలు చేసుకునేప్పుడు చాలామంది బియ్యాన్ని బయట ఆడిస్తారు. మనం తక్కువ మొత్తంలోనే తీసుకుంటున్నాము కాబట్టి ఇంట్లోనే బియ్యం పిండిని సిద్ధం చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పిండిని జల్లేడ పట్టుకోవాలి. అప్పుడే అరిసెలు స్మూత్​గా వస్తాయి.


బెల్లం సిరప్ కోసం..


స్టౌవ్ వెలిగించి.. దానిపై లోతైనా వెడల్పాటి పాన్ పెట్టుకోవాలి. దానిలో తురిమిన బెల్లం వేసి.. దానికి సరిపడ నీరు వేసి బాగా కలపాలి. స్పాచ్యూలాతో దానిని కలుపుకోవాలి. బెల్లం కరిగి చిన్న చిన్న బుడగలు వస్తాయి. పాక ముదురుతున్నప్పుడు.. దానిలోని కొంచెం పాకాన్ని నీటిలో వేసి చూడండి. పాకం విడిపోతే ఇంకాస్త బెల్లం పాకాన్ని ఉడికించాలి. అలా కాకుండా సిరప్ కరిగిపోకుండా.. మీరు ఎలా రౌండ్ చేస్తే అలా అవుతుందనుకో.. పాకం సిద్ధమైపోయినట్లే. 


ఇలా తయారు చేసుకున్న బెల్లం పాకంలో యాలకుల పొడి నెయ్యి వేసి బాగా కలపండి. అనంతరం స్టౌవ్ ఆపేసి ముందుగా తయారు చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా బెల్లం పాకంలో వేసి కలపాలి. పిండి ఉండలు లేకుండా బాగా కలిసేలా కొంచెం ప్రెజర్ పెట్టి కలపాలి. చపాతీ పిండిలాగా పిండి గట్టిగా మారేవరకు బియ్యపు పిండిని కలపాలి. పిండి ఎంత బాగా కలిపితే అరిసెలు అంత టేస్ట్ వస్తాయి అంటారు. ఇలా అరిసెల పిండిని సిద్ధం చేసుకోవాలి. 


అరిసెలు తయారీ విధానం


స్టౌవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టి దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత.. కొంచెం అరిసెల పిండిని తీసుకోవాలి. నూనె రాసిన ప్లేట్​ పై లేదా.. నూనె రాసిన ప్లాస్టిక్ కవర్​పై అరిసెల పిండిని గుండ్రంగా ఒత్తుకోవాలి. దానిపై నువ్వులను చల్లుకోవచ్చు. దీనిని కాగుతున్న నూనెలో వేయాలి. మంటను మీడియం మీదుగా ఉంచి ఉడకనివ్వాలి. గోధుమరంగులోకి మారేవరకు వేయించుకోవాలి. అంతే వేడి వేడి అరిసెలు రెడి. రెండు వైపులా మంచి రంగు వస్తే.. అరిసెను నూనె నుంచి తీసి.. రెండు అట్లకాడలతో గట్టిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల అరిసెలలో ఎక్కువ నూనె ఉండదు. సంక్రాంతి పండుగకి.. వేడి వేడి అరిసెలు సిద్ధమైపోయాయి. మీరు మొదటిసారి సక్సెస్ అయితే తర్వాత ఎక్కువ మొత్తంలో అరిసెలు చేసేయొచ్చు అనమాట. 


Also Read : ఎర్రని చీమలతో టేస్టీ చట్నీ.. ఈ దేశీ వంటకానికి GI ట్యాగ్ కూడా ఇచ్చేశారుగా