Mix Up Trailer: తెలుగు ఓటీటీ ఆహా వీక్షకులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. ఓవైపు బ్లాక్ బస్టర్ సినిమాలు, సరికొత్త చిత్రాలను రిలీజ్ చేస్తూనే.. మరోవైపు ఆసక్తికరమైన వెబ్ సిరీసులు, టాక్ షోలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇతర డిజిటల్ వేదికల్లో బోల్డ్ కంటెంట్ బాగా ఎక్కువైనా, ఆహా మాత్రం ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ నే అప్లోడ్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఓటీటీ కూడా కాస్త ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. తాజాగా రిలీజైన 'మిక్స్-అప్' ట్రైలర్ చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. 


కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మిక్స్ అప్'. ప్రేమ‌ను కామం గెలుస్తుందా? అనే ట్యాగ్ లైన్‌ తో ఆహా ఓటీటీ రూపొందిన ఈ చిత్రానికి ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వచ్చిన ట్రైలర్ చాలా బోల్డ్ గా ఉంది. ఆధునిక సంబంధాలు, లైంగిక జీవితంలోని సంక్లిష్టతలు, ప్రేమ కామం వంటి సున్నితిమైన అంశాల‌తో పెళ్ళైన రెండు కొత్త జంటల మధ్య జరిగే కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. 


'మిక్స్ అప్' ట్రైలర్ లోకి వెళ్తే.. ఆదర్శ్ బాలకృష్ణ - పూజా జవేరి, కమల్ కామరాజు - అక్షర గౌడ పెళ్ళైన కొత్త జంటలుగా కనిపిస్తున్నారు. ఈ రెండు జంటల్లో ఇద్దరు ఒక తరహా ఆలోచనలు కోరికలు కలిగి ఉంటే.. మరో ఇద్దరి ఆలోచనలు వారికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అందువల్ల వారి జీవితాలు హ్యాపీగా సాగడం లేదని అర్థమవుతోంది. అక్షర గౌడ విపరీతమైన లైంగిన వాంఛలు కలిగి ఉంటే, ఆమె భర్త కమల్ మాత్రం లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నాడు. మరోవైపు ఆదర్శ్ విపరీతమైన శృంగార కోరికలతో ఉంటే, అతని భార్య మాత్రం ప్రేమ అనేది మనసుకు సంబంధించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. 


ఇలా భిన్నమైన ఆలోచనలు, కోరికలు, అభిప్రాయాలు కలిగి ఉన్న ఈ జంటలు పరిస్కారం కోసం ఓ సైక్రియార్టిస్ట్ ను కలుస్తారు. ఆమె సలహా మేరకు కాస్త బ్రేక్ తీసుకొని హాలిడేకి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఈ రెండు జంటలు ఒకరి జీవితంలోకి మరొకరు ప్రవేశిస్తారు. ఒకే రకమైన కోరికలున్న అక్షర గౌడ - ఆదర్శ్ బాలకృష్ణ శారీరకంగా దగ్గరైతే.. ఒకే విధమైన ఆలోచనలున్న కమల్ కామరాజు - పూజా జవేరి ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ రెండు జంటల మధ్య జరిగే సంఘర్షణ, భావోద్వేగాల సమాహారమే 'మిక్స్ అప్' కథ అని అర్థమవుతోంది. 



ఓవరాల్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసేలా కట్ చేసిన 'మిక్స్ అప్' ట్రైలర్ టార్గెట్ ఆడియన్స్ ను అలరిస్తోంది. నేటి ఆధునిక సమాజంలోని మాన‌వ సంబంధాల‌కు అద్దంపడుతోంది. యువతీ యువకులు కామ కోరికల కోసం స్వచ్ఛమైన ప్రేమను, జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే విషయాన్ని ఈ మూవీలో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మెసేజ్ ఉన్నప్పటికీ.. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ చాలా ఎక్కువున్నాయి. ఇలాంటి బోల్డ్ కంటెంట్ బాలీవుడ్, హాలీవుడ్ లో కొత్తేమీ కాదు కానీ.. తెలుగులో మాత్రం ఇలాంటివి పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇందులో ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి, కమల్ కామరాజు, అక్షర గౌడ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. శృంగార సన్నివేశాల్లో నటించడానికి కూడా వెనకాడలేదు. 


మిక్స్-అప్ చిత్రానికి హైమా వర్షిణి కథ అందించగా.. తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించారు. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కౌశిక్ సంగీతం సమకూర్చారు. సత్య ఎడిటింగ్ చేసారు. ఈ వెబ్ మూవీని ఆహా వేదికగా మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. 


Also Read: కత్తి పట్టిన అంజలి - ఉమెన్స్ డే స్పెషల్ గా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నుంచి లేడీ గ్యాంగ్ పోస్టర్!