తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువలేని కథానాయకుడు అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao). తెలుగు సినిమా దిశ, దశ మార్చిన హీరోల్లో ఆయన కూడా ముఖులు. ఈ రోజు ఏయన్నార్ జయంతి. మరో ప్రత్యేకత ఏమిటంటే... నేటితో అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి (ANR Birth Centenary) సంవత్సరం కూడా ప్రారంభం అవుతోంది.
ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) చేతుల మీదుగా ఏయన్నార్ పంచలోహ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
పెద్ద పుస్తకం రాయొచ్చు - మోహన్ బాబు
అక్కినేని విగ్రహావిష్కరణలో లెజెండరీ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ ''నన్ను అక్కినేని నాగేశ్వర రావు గారి గురించి మాట్లాడమంటే... పెద్ద పుస్తకం రాయొచ్చు. మా ఇద్దరికీ ఉన్నటువంటి బంధం, అనుబంధం అటువంటిది. తిరుపతిలో నేను చదువుతున్న సమయంలో ఏయన్నార్ గారి సినిమా వంద రోజుల ఫంక్షన్ జరుగుతుంటే... అక్కడికి వెళ్లి చొక్కా చింపుకొని మా రూమ్ కి వెళ్లినవాడిని. మళ్ళీ ఆ చొక్కా కుట్టడానికి కూడా అప్పట్లో డబ్బులు లేవు. అటువంటి అక్కినేని గారితో చిత్రసీమలో 'మరపురాని మనిషి' చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఏయన్నార్ గారితో ఆయన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన ఎన్నో సినిమాల్లో నటించా. అన్నపూర్ణమ్మ గారు నన్ను బిడ్డలా చూసుకున్నారు'' అని అన్నారు.
దర్శక, నిర్మాతలు అందరి తరఫున దర్శక ధీరుడు రాజమౌళిని మాట్లాడమని కోరారు. ఆయన తనకు అంత స్థాయి లేదని వినమ్రంగా చెబుతూ... ''నాగేశ్వరరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆయనను ఆరాధించా. వ్యక్తిగతంగా ఆయనతో నాకు పరిచయం తక్కువ. ఓ అవార్డు వేడుకకు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే రూములో ఉన్నాం. అప్పుడు 'దేవదాసు' తర్వాత 'మిస్సమ్మ'లో కమెడియన్ రోల్ ఎందుకు చేశారని అడిగా. అప్పుడు ఆయన 'నాకు దేవదాసు తర్వాత అన్నీ తాగుబోతు కథలు వస్తున్నాయి. అందుకని నేను అడిగి మరీ మిస్సమ్మ చేశా' అని చెప్పారు. చక్రపాణి గారు, వాళ్ళు అభిమానులు కొడతారని చెప్పినా సరే... పట్టుబట్టి చేశారట. ఇమేజ్ మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పారట. ఆయన మీద ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ కి చేతులు ఎత్తి నమస్కరించాలి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఎన్నో కథలు విన్నా'' అని చెప్పారు.
ఏయన్నార్ పంచలోగా విగ్రహావిష్కరణలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మోహన్ బాబు, మురళీ మోహన్, టి సుబ్బరామిరెడ్డి, ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, నమ్రత దంపతులు, రామ్ చరణ్, బ్రహ్మానందం, జయసుధ, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై అక్కినేని గొప్పదనాన్ని వివరించారు. అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Also Read : 'జైలర్'లో విలన్‌కు 35 లక్షలే ఇచ్చారా? - అసలు నిజం చెప్పిన వినాయకన్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial