ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ కు చికిత్స తీసుకోడానికి అమెరికాకు వెళ్ళింది. అక్కడ వివిధ ప్రదేశాల్లో విహరిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా సామ్ ఇంస్టాగ్రామ్ లో చాట్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. సినిమా సంగతులే కాకుండా కొన్ని మోటివేషన్ విషయాలను పంచుకుంది. 


వినాయక చవితి సందర్భంగా ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా 'మీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ గురించి ఏమైనా చెప్పగలరా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ప్రస్తుతానికి ఏమీ ప్లాన్స్ లేవని తెలిపింది. ''నిజానికి నా తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ఇప్పటికైతే ఎలాంటి ప్లాన్స్ లేవు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేయాలనుకుంటున్నా. అలాంటి వాటి మీదనే దృష్టి పెడుతున్నా. నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి, నాకు ఓకే అనిపించే కొన్ని రోల్స్ చేయాలని అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో'' అని సమంత బదులిచ్చింది. 


'మీ నుంచి ఫుల్ యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా?' అని ఓ అభిమాని అడగ్గా, అవునని సమాధానమిచ్చింది. ''నిజంగా నేను యాక్షన్ అంటే చాలా ఎగ్జైట్ అవుతాను. ఎందుకో తెలియదు, నేను అలాంటి పర్సన్ ని కూడా కాదు. అయినా సరే యాక్షన్ సినిమాలని బాగా ఇష్టపడతాను.. అవి నాకు చాలా నచ్చుతాయి. మీరు 'సిటాడెల్‌' వెబ్ సిరీస్ లో యాక్షన్‌ చూడవచ్చు. అందులో నా పాత్ర హాట్ హాట్‌ గా ఉంటుంది. కానీ చాలా ఫన్నీగా ఉంటుంది. అలాంటి ఛాలెంజింగ్ పాత్రలను నేను ఇష్టపడతాను. దాన్ని మీకు చూపించడానికి ఆతృతగా వేచి చూస్తున్నా. అది మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా ఫుల్ యాక్షన్ రోల్ చేస్తాను'' అని సమంత చెప్పింది. 


'జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న యువతకు మీరిచ్చే సలహా ఏంటి?' అని ఓ నెటిజన్ అడగ్గా.. "ఏదైనా చిన్న సమస్య వస్తే, 'నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది' అనుకోవద్దు. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. ఇప్పుడే మీ జీవితం మొదలైందని అనుకోండి. మీ ప్రయాణంలో మీకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఎన్నో సమస్యలు పలకరిస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. కొన్నిసార్లు చివరకు అవే మనల్ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తాయి. నాకు అదే జరిగింది. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఇలా ఉంటానని అనుకోలేదు. లైఫ్ లో నేను పేస్ చేసిన అన్ని సమస్యలే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయని అనుకుంటాను. స్ట్రాంగ్ గా, హ్యాపీగా ఉండాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి'' అని సమంత వివరించింది. 


'నిజ జీవితంలో జీవించడానికి మీరు పాటించే 3 విషయాలు చెప్పండి' అని ఓ అభిమాని కోరగా.. ''నేను ఏదైనా సాధించగలను.. పరిస్థితులేంటి ఇలా ఉన్నాయని ప్రశ్నించడం మానేసి, వాస్తవికతతో వాటిని స్వీకరిస్తా.. నీతి, నిజాయతీలతో ముందుకు సాగుతా'' అని సామ్ తెలిపింది. 'మీ స్కిన్ అంత కాంతివంతంగా ఎలా ఉంది?' అని అడగ్గా.. ''ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్లు నా స్కిన్ లేదు. చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్డాను. విపరీతమైన పిగ్మెంటేషన్‌ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానని చెప్పింది'' అని సమాధానం ఇచ్చింది. 'నా గ్లోరీ స్కిన్ ఎక్కడ?' అని చిన్మయి శ్రీపాదని ప్రశ్నించింది. 'నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆస్ట్రియాకి వెళ్లనున్నట్లు చెప్పింది సామ్. తాను బెటర్ గా అవడానికి కాస్త బ్రేక్ తీసుకొని, ట్రావెల్ చేసి నా విష్ లిస్టులో ఉన్న అన్ని ప్రదేశాలు తిరగాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. 


ఇకపోతే సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే సామ్ మాత్రం ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ ఏమీ సైన్ చేయలేదని స్పష్టం చేసింది. ఆమె త్వరలోనే 'సిటాడెల్' వెబ్ సిరీస్ తో రాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపొందుతోంది. ఇది రూసో బ్రదర్స్ 'సిటాడెల్‌' అమెరికన్‌ టీవీ సిరీస్‌ కు ఇండియన్‌ వెర్షన్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. సామ్ గతంలో 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే.


Also Read: Jawan for Oscars: 'జవాన్'ని ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial