కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ 'జవాన్' మూవీతో గ్రాండ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వారంలోనూ భారీ వసూళ్లు రాబడుతూ రూ. 1000 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డ్ వరకూ తీసుకెళ్లాలని దర్శకుడు ఆశ పడుతున్నారు.


అట్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'జవాన్' మూవీ ఆస్కార్ కు వెళ్లాలని కోరుకుంటున్నట్లు నవ్వుతూనే తన మనసులోని కోరికను బయటపెట్టాడు. దీని గురించి ఫోన్ చేసి షారుక్ ఖాన్ తో మాట్లాడతానని చెప్పాడు. బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డు కోసం చూస్తున్నారా? అని దర్శకుడిని అడగ్గా, ఈ విధంగా స్పందించారు.


“అఫ్ కోర్స్, అంతా సరిగ్గా జరిగితే 'జవాన్' కూడా ఆస్కార్ కు వెళ్ళాలి. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి పని చేసే ప్రతీ దర్శకుడు, టెక్నీషియన్, సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరి లక్ష్యం గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్లు, జాతీయ అవార్డ్ అయ్యుంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి, ఖచ్చితంగా, నేను 'జవాన్‌'ను ఆస్కార్‌కి తీసుకెళ్లడానికి ఇష్టపడతాను. చూద్దాం. ఖాన్ సార్ ఈ ఇంటర్వ్యూని చదువుతారని అనుకుంటున్నాను. 'సార్, మనం ఈ చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్లాలా?' అని ఫోన్ చేసి కూడా అడుగుతాను" అని అట్లీ చెప్పుకొచ్చారు.


Also Read: మోహన్ లాల్ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!


ఆస్కార్ ను ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా పేర్కొంటారు. ఎస్.ఎస్. రాజమౌళి ఇండియన్ సినిమాకు ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టారు. RRR మూవీలోని 'నాటు నాటు' పాట ఈ ప్రిస్టేజియస్ పురస్కారాన్ని సాధించింది. మన సినిమాలు కూడా అకాడెమీ అవార్డులు గెలుచుకోగలవనే భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అట్లీ స్టేట్మెంట్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. 


అట్లీ ఆస్కార్ కల కనడంలో తప్పేం లేదు కానీ, తన చిత్రానికి ఆ స్థాయికి వెళ్లే అర్హత ఉందా లేదా? అనేది ఆలోచించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'జవాన్' ఒక హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్. ఇది సమాజంలోని తప్పులను ఎత్తిచూపి, వాటిని సరిద్దిదే ఒక వ్యక్తి ఎమోషనల్ జర్నీ. సామాజిక, రాజకీయ అంశాలను హైలైట్ చేస్తూ పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దారు. కాకపోతే కథలో కొత్తదనం ఏమీ లేదని, కొన్ని సౌత్ సినిమాల కలయికగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా 'మనీ హీస్ట్' వెబ్ సిరీస్ ని కాపీ కొట్టి 3 గంటల మూవీగా తీసారని ట్రోలింగ్ చేశారు. అందుకే అట్లీ ఆస్కార్ అభ్యర్థనను SRK తీవ్రంగా పరిగణిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.


'జవాన్' లో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసారు. విక్రమ్ రాథోడ్, ఆజాద్ వంటి తండ్రీ కొడుకుల పాత్రల్లో అదరగొట్టాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా చేసాడు. దీపికా పదుకొణె, సంజయ్ దత్ ప్రత్యేక అతిధి పాత్రల్లో కనిపించారు. వీరితో పాటుగా సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా, యోగి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.


షారుక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 300 కోట్లకు పైగా బడ్జెట్ తో 'జవాన్' మూవీ తెరకెక్కింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. సెప్టెంబర్ 7వ తారీఖున థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. 11 రోజుల్లోనే రూ. 858 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. వెయ్యి కోట్ల క్లబ్ కి అతి చేరువలో ఉంది. కచ్ఛితంగా 'పఠాన్' కలెక్షన్స్ ను అధిగమించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Also Read:  వెంటిలేటర్ సపోర్ట్‌తో 'జవాన్' సినిమా చూసిన అభిమాని వీడియోపై స్పందించిన కింగ్ ఖాన్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial