మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు కామన్ అనుకోవాలి. రీసెంట్‌గా రిలీజైన 'ఖిలాడి'లో ఇద్దరు హీరోయిన్లు మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి ఉన్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'రామారావు ఆన్ డ్యూటీ'లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ ఉన్నారు. ఉగాదికి ప్రారంభం కానున్న 'టైగర్ నాగేశ్వరరావు'లో కూడా ఇద్దరు ఉన్నారు.


'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Biopic) సినిమాలో మాస్ మహారాజా రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ నటించనున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా మోడల్ గాయత్రి భరద్వాజ్ నటించనున్నట్టు ప్రకటించారు. హీరోయిన్లు ఇద్దరికీ రవితేజతో తొలి చిత్రమిది. హీరో హీరోయిన్లకు తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే.


ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి వంశీ దర్శకుడు. ఉగాదికి చిత్రాన్ని ప్రారంభించి, అదే రోజు ప్రీ లుక్ విడుదల చేయనున్నారు. 'ది కాశ్మీర్ ఫైల్స్'తో భారీ విజయం అందుకున్న అభిషేక్ అగర్వాల్, ఆ సినిమా తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది.








1970వ దశకంలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, డైలాగ్ రైటర్: శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.


Also Read: 'శర్మాజీ న‌మ్‌కీన్‌' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?