2024 Sankranti Movies:  దసరా పండక్కి బాక్సాఫీస్ వద్ద నాలుగు క్రేజీ సినిమాలు పోటీ పడబోతున్నాయి. వాటిల్లో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలైతే, రెండు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి', 'లియో' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు', 'గణపత్' పార్ట్-1 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో కావాల్సినంత బజ్ క్రియేట్ చేసాయి. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ, ఈ నాలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించడంలోనే సమస్య ఎదురైంది. తెలుగు సినిమాల కంటే తమిళ డబ్బింగ్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 


తమిళ హీరో విజయ్ నటించిన 'లియో' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 800లకు పైగా థియేటర్లు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలకు మాత్రం కేవలం 500 థియేటర్లు మాత్రమే ఇచ్చినట్లుగా చెబుతున్నారు. థియటర్ల విషయంలో తెలుగు హీరోల సినిమాల కంటే పక్క రాష్ట్ర డబ్బింగ్ మూవీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఓ వర్గం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమిళనాడులో 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి ఓ మోస్తరు థియేటర్లు దొరకడమే గగనంగా మారితే, తమిళ్ డబ్బింగ్ సినిమాకి మాత్రం తెలుగులో తిరుగులేని థియేటర్లు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. 


'లియో' సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం దసరాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల షేరింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు', 'లియో'.. మూడు చిత్రాలకు సరిపడా మంచి స్క్రీన్లు లభించాయని చెబుతున్నారు. ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారని పేర్కొన్నారు. ఏదైతేనేం విజయదశమికి మూడు పెద్ద సినిమాలు రిలీజులు ప్లాన్ చేస్తేనే, థియేటర్లు కేటాయించడానికి సర్దుబాటు చేయడానికి కిందా మీదా పడుతున్నారనేది అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే నిజంగా సంక్రాంతికి అనుకున్న చిత్రాలన్నీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.


Also Read: అల్లువారి ఇంట వరుణ్‌ తేజ్ - లావణ్య ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌.. ఫొటోలు వైర‌ల్! 


టాలీవుడ్ లో సంక్రాంతి పండుగను సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ గా భావిస్తారు. అందుకే రిలీజుల విషయంలో తీవ్ర పోటీ ఉంటుంది. ఈసారి కూడా అలానే ఉంది. 2024 పొంగల్ కి రాబోతున్నట్లు ఇప్పటి వరకూ అర డజను చిత్రాలు అధికారికంగా ప్రకటనలు ఇచ్చాయి. మహేశ్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమాని జనవరి 12న విడుదల చేయడం పక్కా అని మేకర్స్ తెలిపారు. వెంకటేష్ నటిస్తున్న 'సైంధవ్' మూవీని జనవరి 13న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అనౌన్స్ చేసారు. రవితేజ 'ఈగల్' చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పండక్కే వస్తుందని నిర్మాతలు బల్లగుద్ది చెబుతున్నారు. 


అక్కినేని నాగార్జున 'నా సామి రంగా' సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతికి మాస్ జాతర ఉంటుందని ప్రకటించారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని అదే సీజన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. సరైన డేట్ కోసం చాలా నెలలుగా ఎదురు చూస్తున్న తేజ సజ్జా 'హనుమాన్' మూవీని కూడా పొంగల్ బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఇలా అర డజను తెలుగు చిత్రాలు సంక్రాంతే కావాలని అంటుంటే.. 'అయాలన్' 'అరణ్మనై 4' వంటి రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అవుతున్నాయి. అంటే మొత్తం 8 సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలని చూస్తున్నాయి. 


మామూలుగా ప్రతీ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైనా పెద్దగా థియేటర్ల సమస్య వచ్చేది కాదు. తెలుగు చిత్రాలకు సరిపడా స్క్రీన్లు లభించేవి. కానీ ఈసారి మాత్రం ఒకేసారి ఎనిమిది సినిమాలకు థియేటర్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే ఎవరూ తగ్గడం లేదు. ఒకవేళ నిజంగానే ఆ సినిమాలన్నీ అనుకున్న సమయానికే రావాలని చూస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం సినీ ప్రముఖులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇవన్నీ అలోచించి చూస్తే ఫైనల్ గా నాలుగైదు చిత్రాలు మాత్రమే పండుగ బరిలో ఉండేలా చూసుకునే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.


Also Read: ‘బిగ్ బాస్’లోకి మ‌న్నారా చోప్రా - డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial