బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ప‌రిణితీ చోప్రాల‌ కజిన్ గా 'ప్రేమ గీమా జాన్తా న‌య్' అనే సినిమాతో టాలీవుడ్‌ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సునీల్ సరసన 'జక్కన్న', సాయి ధరమ్ తేజ్ తో కలిసి 'తిక్క' సినిమాలు చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'రోగ్'.. డైరెక్టర్ తేజ తెరకెక్కిన 'సీత' సినిమాల్లో నటించింది. కానీ అమ్మడికి ఏమాత్రం అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ భామ.. 'తిర‌గ‌బ‌డ‌రా సామీ' చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే ఇంతలోనే హిందీ 'బిగ్‌ బాస్' సీజన్ 17 లో కంటెస్టెంట్‌ గా పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. 


బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలైన మజాని పరిచయం చేసిన హిందీ 'బిగ్‌ బాస్'.. ఇప్పటికే 16 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని సరికొత్త సీజన్ తో వచ్చేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ - 17 రియాలిటీ షో ఆదివారం గ్రాండ్ గా ప్రారంభ‌మైంది. దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్ స‌ల్మాన్‌ ఖాన్ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్‌ గా హీరోయిన్ మ‌న్నారా చోప్రా ఎంట్రీ ఇచ్చింది. చోప్రా ఫ్యామిలీ అనే గుర్తింపుతో కాకుండా త‌న కష్టంతోనే బిగ్‌ బాస్ వరకూ రాగలిగానని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె తన ఇటీవలి వివాదాస్పద క్షణాన్ని ప్రస్తావించింది. దర్శకుడు ఏఎస్ రవికుమార్ ముద్దు గురించి వివరణ ఇచ్చింది. 


ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్‌ త‌రుణ్, మ‌న్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'తిర‌గ‌బ‌డ‌రా సామీ'. ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌ లో దర్శకుడు అకస్మాత్తుగా మన్నారా చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. ప‌బ్లిక్‌ గా హీరోయిన్‌ ను రవి కుమార్ ముద్దు పెట్టుకోవడంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కూతురు వయసున్న అమ్మాయితో మీడియా ముఖంగా అలా అసభ్యకరంగా బిహేవ్ చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుకోని విధంగా మన్నారా చోప్రా కూడా వార్తల్లో నిలిచింది. 'బిగ్ బాస్-17' ప్రీమియర్ ఎపిసోడ్‌లో మన్నారా కాంట్రవర్సీ కిస్ గురించి మాట్లాడుతూ.. దాని వెనుక తప్పుడు ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. 


Also Read: 'ఇది ఒక ప్రశ్ననా?'.. ఆ విలేఖరిపై అసహనం వ్యక్తం చేసిన వరలక్ష్మి!


డైరెక్ట‌ర్ ర‌వి కుమార్ చౌద‌రి చాలా రోజుల త‌ర్వాత త‌న‌ను కలుసుకోవడంతో, సంతోషంలో అలా త‌న చెంప‌పై ముద్దు పెట్టార‌ని మన్నారా చోప్రా తెలిపింది. తాము స్నేహితులుగా ఎంతో సన్నిహితంగా మెలిగే వాళ్లమని, ర‌వికుమార్ త‌న‌కు తండ్రితో స‌మాన‌మ‌ని చెప్పింది. డైరెక్టర్ తో ముద్దు కాంట్రవర్సీపై అప్పుడే సోషల్ మీడియా వేదికగా స్పందించింది మన్నారా. దర్శకుడిని సమర్థిస్తూ ఆయనకు ఎటువంటి దురుద్దేశాలు లేవని నమ్ముతున్నానంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. "నా సినిమా ప్రమోషన్ ఊహించని మలుపు తిరుగుతుందని నాకు తెలియదు. నేను వ్యక్తపరచాలనుకుంటున్న ప్రతిదీ ఇప్పటికే చెప్పేసాను. దీని గురించి ఇంతకంటే మాట్లాడటానికి నేను సిద్ధంగా లేను" అని రాసుకొచ్చింది మన్నారా. 






Also Read: అల్లువారి ఇంట వరుణ్‌ తేజ్ - లావణ్య ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌.. ఫొటోలు వైర‌ల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial