మెగా ఫ్యామిలీ ఇంట మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న టాలీవుడ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఘనంగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వరుణ్ పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇటీవల గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయగా.. తాజాగా అల్లు వారి ఇంట్లో గ్రాండ్ గా పార్టీ జరిగింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల వెడ్డింగ్ దగ్గర పడుతున్న సందర్భంగా కాబోయే వధూవరులకు కంగ్రాట్స్ చెబుతూ అల్లు అరవింద్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి ఒక్క రామ్ చరణ్ తప్ప మిగతా మెగా అల్లు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ''రాబోయే వరుణ్ - లావణ్యల పెళ్లి వేడుకలను పురస్కరించుకుని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఇంట్లో పార్టీ జరిగింది'' అని శిరీష్ పేర్కొన్నారు.
అల్లు ఇంట జరిగిన ఈ పార్టీకి లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్ - లావణ్యలతో పాటుగా చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులు, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, ఉపాసన, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుష్మిత కొణిదెల, అల్లు శిరీష్, అల్లు అరవింద్.. ఇలా మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అంతా పాల్గొన్నారు. టాలీవుడ్ హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ, హీరోయిన్ రీతూవర్మ, పలువురు సన్నిహితులు ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో సందడి చేశారు. వరుణ్ - లావణ్యలతో కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: సంక్రాంతికి పెద్దోడు, చిన్నోడి సినిమాలు రెండూ సూపర్ హిట్టే: వెంకటేశ్
కాగా, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిలు ‘మిస్టర్’ ‘అంతరిక్షం’ సినిమాలలో కలిసి నటించారు. ఇద్దరి మనసులు కలవడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట.. కుటుంబ సభ్యులను ఒప్పించి జూన్ నెలలో సింపుల్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దాదాపు ఐదారేళ్ల నుంచి తాము స్నేహితులమని, ఇద్దరి అభిరుచులు కలవడంతో రిలేషన్ లోకి వచ్చామని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వరుణ్ చెప్పారు. మొదట తానే ప్రపోజ్ చేశానని తెలిపారు. నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్ గా ఉంటుందని అన్నారు.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిలు నవంబర్ 1వ తేదీన పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటలీలోని టస్కానీ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, అతి తక్కువమంది బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే మెగా వెడ్డింగ్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ఇక సినిమాల విషయానికొస్తే, వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఓ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని తర్వాత 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' అనే మూవీలో నటించనున్నాడు వరుణ్. మరోవైపు 'పులి మేక' వెబ్ సిరీస్ లో కనిపించిన లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. తమిళ్ లో ఆమె నటించిన 'థనల్' అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Also Read: 'ఇది ఒక ప్రశ్ననా?'.. ఆ విలేఖరిపై అసహనం వ్యక్తం చేసిన వరలక్ష్మి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial