2013 సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న పెద్దోడు, చిన్నోడు.. దశాబ్దం తర్వాత అదే పండక్కి బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారబోతున్నారు. ‘సైంధవ్‌’, 'గుంటూరు కారం' సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఒకప్పుడు అన్నదమ్ముల్లా కలిసి నటించిన విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాబోయే పొంగల్ బరిలో పోటీగా దిగుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా వెంకీ వద్ద ప్రస్తావించగా, మహేశ్ మూవీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.


వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సైంధవ్‌’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం మూవీ టీజర్‌ ను రిలీజ్ చేసారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకీ మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 


ఈ సందర్భంగా ''పండక్కి పెద్దోడు ‘సైంధవ్‌’తో, చిన్నోడు ‘గుంటూరు కారం’తో కలిసి వస్తున్నారు. ఈ క్లాష్ పై ఏం చెప్తారు?'' అని వెంకటేష్ ని ప్రశ్నించగా.. రెండు సినిమాలూ మంచి విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ''పెద్దోడు వస్తే సూపర్‌ హిట్‌. చిన్నోడు వస్తే సూపర్‌ హిట్‌. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చూడలేదా?. ప్రేక్షకులు పెద్దోడి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. అలానే చిన్నోడి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి పండక్కి మా ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆడియన్స్ రెండు సినిమాలను చూసి బాగా ఆదరిస్తారని నేను చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను'' అని వెంకీ అన్నారు. 


Also Read: క్రికెట్ మ్యాచ్​కు వెళ్లి గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న ఐటెం భామ!


మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గుంటూరు కారం' సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మరోవైపు 'సైంధవ్‌' చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే ఉన్నట్టుండి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించడంతో వెనక్కి తగ్గారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. దీంతో మహేశ్, వెంకీ మామల మధ్య క్లాష్ అనివార్యమైంది. అయితే దీన్ని ఆరోగ్యకరమైన పోటీగానే చూడాలని వెంకటేశ్ మాటలను బట్టి అర్థమవుతోంది. 


‘సైంధవ్‌’ ఒక అద్భుతమైన కథ అని, న్యూ స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌ కు ఇందులో స్కోప్‌ ఉందని వెంకీ తెలిపారు. ఇందులో ఉన్న ఎమోషన్స్‌ ను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తన పాత్ర వైల్డ్‌ గా చాలా క్రేజీగా ఉంటుందని, ఈ పాత్రలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయన్నారు. ఫ్యామిలీ యూత్‌ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఈ పాత్ర నచ్చుతుందన్నారు. కచ్చితంగా ఒక కొత్త వెంకీని చూస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఈ సినిమా సంక్రాంతికి తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. శైలేష్ కొలను డాటర్ సెంటిమెంట్‌ ని కొత్తగా చూపించారని.. న్యూ లుక్‌ తో పాటుగా పెర్ఫార్మెన్స్‌ విషయంలో తనకు మరింత స్కోప్‌ లభించిందని వెంకీ చెప్పుకొచ్చారు. 


‘సైంధవ్‌’ సినిమాలో వెంకటేశ్ తో పాటుగా శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్ పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Also Read: థియేటర్లలో విడుదలైన 9 నెలల తర్వాత టీవీల్లో రాబోతున్న మెగా మాస్ బ్లాక్ బస్టర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial