మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా కొల్లు రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ. 225 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సత్తా చాటింది. సినిమా వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ టీవీలో టెలికాస్ట్ అవ్వకంపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ మూవీ వరల్డ్‌ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. 


'వాల్తేరు వీరయ్య' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫిక్స్ సొంతం చేసుకోగా, శాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ గ్రూపుకు చెందిన జెమినీ టీవీ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని బుల్లితెర మీద చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు జెమినీ టీవీ నిర్వాహకులు తాజాగా శుభ‌వార్త అందించారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 23న సాయంత్రం 6 గంటలకు వరల్డ్‌ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రోమోని ప్రదర్శించారు.






జనవరి 13న థియేటర్లలో విడుదలైన 'వాల్తేరు వీరయ్య' సినిమా.. దాదాపు ఆరు వారాల తర్వాత ఫిబ్రవరి నెలాఖరున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబడింది. ఓటీటీలోనూ విశేష ఆదరణతో దూసుకుపోయింది. రికార్డ్ స్థాయిలో వ్యూవర్ షిప్ రాబట్టి, కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లిస్టులో టాప్ లో నిలిచింది. అయితే తొమ్మిది నెలల తర్వాత దసరా పండక్కి టీవీల్లో ప్రసారం చేయడానికి జెమినీ టీవీ రెడీ అవుతోంది. 


నిజానికి ఓటీటీల హవా మొదలైన తర్వాత, టెలివిజన్ ప్రీమియర్స్ కు పెద్దగా హైప్ ఉండటం లేదు. థియేట్రికల్ రిలీజైన నాలుగైదు వారాల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి వస్తుండటంతో, ఎంత పెద్ద సినిమా అయినా సరే ఆశించిన మేర టీఆర్పీ రేటింగ్ రాబట్టడం లేదు. అందుకే అసలు ఏ మూవీ ఎప్పుడు టీవీలోకి వస్తోందనేది కూడా జనాలకు తెలియడం లేదు. మరి ఇప్పుడు ఈ మెగా మాస్ మూవీకి టీవీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. 


'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, ప్రదీప్ రావత్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మెగాస్టార్ కి వీరాభిమాని అయిన డైరెక్టర్ బాబీ.. చిరుని ఇంతకు ముందెన్నడూ చూడని పవర్ ప్యాక్ మాస్ రోల్ లో ప్రెజెంట్ చేసారు. రవితేజ తనవంతు సపోర్ట్ అందించి, సినిమా విజయంలో భాగం పంచుకున్నారు. 


మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్ 'వాల్తేరు వీరయ్య' సినిమాని నిర్మించారు. బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్ - కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ ప్లే అందించారు. రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా.. ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేసారు. 


Also Read: క్రికెట్ మ్యాచ్​కు వెళ్లి గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న ఐటెం భామ!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial