తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘మాన్షన్‌ 24’. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్‌ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సత్యరాజ్‌, అవికా గోర్‌, బిందు మాధవి, అభినయ, నందు, రావు రమేష్‌, నళిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆసక్తిని కలిగించాయి. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ వేదికగా రేపు అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నపై వరలక్ష్మి కాస్త అసహనం వ్యక్తం చేసింది. 


ఇటీవల కాలంలో మీడియా ఇంటరాక్షన్ లలో వింత ప్రశ్నలు అడుగుతూ బాగా పాపులర్ అయ్యారు సురేష్ కొండేటి. ఇప్పుడు ‘మాన్షన్‌ 24’ ఈవెంట్ లోనూ అలాంటి ప్రశ్నతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఓ పురాతన బంగ్లాలోకి వెళ్లిన వారందరూ మాయం కావడం అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 'మీరు దెయ్యాలను నమ్ముతారా?' అని వరలక్ష్మినీ ప్రశ్నించగా.. ఉన్నాయని నమ్ముతానని సమాధానమిచ్చింది. ఆ వెంటనే మైక్ అందుకున్న సురేష్ కొండేటి.. 'దెయ్యాలు ఉన్నాయనే సినిమా చేసారా?' అని ప్రశ్నించాడు. దీనికి వరు స్పందిస్తూ.. 'అలా అనుకుంటే మనం వేరే ఏ సినిమాలు చేయకూడదు కదా?' అని ఎదురు ప్రశ్నించింది. 


అయితే అక్కడితో ఆగకుండా 'మీరు దెయ్యాన్ని ఇష్టపడతారా? దేవుడుని ఇష్టపడతారా?' అని అడిగారు సురేష్ కొండేటి. ఈ ప్రశ్నపై వరలక్ష్మి అసహనం వ్యక్తం చేస్తూ.. ''జనరల్ గా ఎవరైనా ఎవరిని ఇష్టపడతారండి? ఇది ఒక ప్రశ్ననా.. మీకు దెయ్యం అంటే ఇష్టంలా ఉంది కదా'' అని బదులిచ్చింది. దీంతో సురేష్ తన ప్రశ్నను సమర్ధించుకుంటూ.. ''మీ డైరెక్టర్ ఓంకార్ కి దెయ్యాలంటే ఇష్టం, అందుకే 'రాజు గారి గది' లాంటి సినిమాలు చేస్తున్నారు'' అన్నాడు. దీనికి ఓంకార్ స్పందిస్తూ.. ''నేనెప్పుడూ దెయ్యాలను ఇష్టపడతానని చెప్పలేదు. అన్నీ ఆయనే చెప్పేసుకుంటున్నారు'' అంటూ నవ్వుతూనే సెటైర్ వేసాడు. 


Also Read: థియేటర్లలో విడుదలైన 9 నెలల తర్వాత టీవీల్లో రాబోతున్న మెగా మాస్ బ్లాక్ బస్టర్!


‘మాన్షన్‌ 24’ ప్రెస్ మీట్ లో సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకు వరలక్ష్మీ శరత్ కుమార్ సమాధానమిచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎప్పటిలాగే కొండేటిని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి అర్థం పర్థంలేని ప్రశ్నలు అడిగితే ఎవరైనా వరలక్ష్మి మాదిరిగానే రియాక్ట్ అవుతారని కామెంట్లు పెడుతున్నారు. ఆ మధ్య డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం సురేష్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. 'పొలిమేర 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనూ సురేష్ కొండేటిపై హరీష్ సెటైర్లు వేశారు. ''సంస్కారవంతుడైన సురేష్ కొండేటి గారిని చూడటం.. నిలువెత్తు సంస్కారానికి నిలువుటెత్తు అద్దం లాంటి సురేష్ కొండేటి గారిని చూడటం ఆనందంగా ఉంది'' అని హరీష్ శంకర్ తనదైన శైలిలో పంచ్ వేశారు. అయినా సరే సురేష్ కొండేటి తీరు మార్చుకోకుండా ఇప్పుడు వరలక్ష్మీకి చిరాకు తెప్పించే ప్రశ్న అడిగారని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 


ఇక ‘మాన్షన్‌ 24’ విషయానికొస్తే, ఇందులో సత్యరాజ్‌-వరలక్ష్మి తండ్రీకుమార్తెలుగా నటించారు. ఓ పురాతన బంగ్లాలోకి వెళ్లి అదృశ్యమైన కాళిదాస్‌(సత్యరాజ్‌)ను వెతకడం కోసం ఆయన కుమార్తె (వరలక్ష్మి శరత్) ఏం చేశారు? కాళిదాస్‌ ఆ మాన్షన్‌ లోకి ఎందుకు వెళ్లాడు? అసలు ఆ బంగ్లా వెనకున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 ఉంటుందని, అందులో అశ్విన్ బాబు లీడ్ రోల్ ప్లే చేస్తారని దర్శకుడు ఓంకార్ వెల్లడించారు. 


Also Read: సంక్రాంతికి పెద్దోడు, చిన్నోడి సినిమాలు రెండూ సూపర్ హిట్టే: విక్టరీ వెంకటేశ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial