69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో వైభవంగా జరిగింది. 2021 సంవత్సరానికి ఫీచర్ ఫిల్మ్స్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ లో వివిధ విభాగాల్లో ఎంపికైన చిత్రాలకు అవార్డులు ప్రధానం చేశారు. ఈసారి 'ఉత్తమ నటి' పురస్కారం ఇద్దరు నటీమణులను వరించింది. బాలీవుడ్ భామలు అలియా భట్  , కృతిసనన్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా  అలియా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.


'గంగూబాయి కతియావాడి' సినిమాలో అద్భుతమైన నటనకు గాను అలియా భట్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకుంది. ఆమె ఈ వేడుకకు తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి హాజరైంది. నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న తర్వాత ట్వీట్ చేస్తూ.. ''ఒక ఫోటో, ఒక క్షణం, జీవితానికి ఒక జ్ఞాపకం'' అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది అలియా. ఇందులో తన భర్తతో తీసుకున్న ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ స్వీకరిస్తున్న ఫోటో, తనతో పాటుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ - కృతి సనన్ లతో దిగిన ఫొటోలు కూడా అలియా భట్ షేర్ చేసింది. సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోతున్న 'గంగూబాయి' బ్యూటీ పిక్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శారీకి మ్యాచ్ అయ్యే నగలు ధరించి, తెల్లని గులాబీ పూలు పెట్టుకొని ఆమె ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.






సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది ఆలియా భట్. సెక్స్‌ వర్కర్ల హక్కుల కోసం ఎలా పోరాడి 'మేడమ్ ఆఫ్‌ కామతిపుర'గా పిలవబడిన గంగుబాయి బయోపిక్ ఇది. ఇందులో ఆలియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మరోవైపు లక్ష్మణ్‌ ఉటేకర్‌ రూపొందించిన 'మిమి' మూవీలో నటనకుగానూ కృతిసనన్ అవార్డ్ అందుకుంది. 


ఉత్తమ నటుడు కేటగిరీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు. తద్వారా 68 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. జాతీయ ఉత్తమ చిత్రంగా 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌ ' (హిందీ) అవార్డు సాధించింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా జాతీయ సమగ్రతపై చిత్రంగా ఎంపికైంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి ఆరు పురస్కారాలు లభించగా.. 'పుష్ప: ది రైజ్‌' చిత్రం రెండు అవార్డులు వచ్చాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన', బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు అందుకున్నారు. 'కొండపొలం' సినిమాలోని 'ధమ్‌ ధమ్‌ ధమ్‌' పాటకు చంద్రబోస్‌ ఉత్తమ గీత రచయితగా పురస్కారం స్వీకరించారు.


ఇక అలియా భట్ విషయానికొస్తే, RRR సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది 'రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అలానే 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే అమెరికన్ ఫిలింలో నటించింది. ప్రస్తుతం 'జిగ్రా' అనే హిందీ మూవీలో నటిస్తోంది. దీనికి అలియా నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial