ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రీలీల. ఆమె నటించిన చిత్రాలు వరుసగా హిట్ కావడంతో మంచి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగులో సుమారు డజన్ సినిమాలు చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ అంటేనే డ్యాన్స్ కు కేరాఫ్ అన్నట్లుగా మారిపోయింది. అందం, అభినయంతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేయడంలో తనకు తానే సాటి. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే హీరోలను తలదన్నేలా దుమ్మురేపుతోంది. రీసెంట్ గా రవితేజతో కలిసి నటించిన ‘ధమాకా’ చిత్రంలో ఆమె డ్యాన్స్ కు ప్రేక్షకులు మైమరచిపోయారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ 15న రామ్ తో కలిసి నటించిన ‘స్కంద’ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
శేఖర్ మాస్టర్‌కు సారీ చెప్పిన శ్రీలీల
డ్యాన్స్ చక్కగా చేసే తనకు ఓ సినిమా విషయంలో చాలా ఇబ్బంది కలిగిందని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఒక పాట విషయంలో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం బాధ కలిగించిందని చెప్పింది. నిజానికి తనకు రీటేక్స్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదని, ఓసారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఏకంగా ముప్పై టేకులు తీసుకున్నట్లు చెప్పింది. ఆ పాట కోసం చాలా ప్రాక్టీస్ చేసినా, షూటింగ్ సమయంలో అస్సలు వర్కౌట్ కాలేదని చెప్పింది. షూటింగ్ అయిపోయాక, ఇంటికి వెళ్లి శేఖర్ మాస్టర్ కు లేఖ రాసినట్లు చెప్పింది. ఎక్కువ టేక్స్ తీసుకున్నందుకు క్షమించాలని ఆ లేఖలో కోరినట్లు వివరించింది. ఈ లేఖను చూసి శేఖర్ మాస్టర్ ఆమెకు కాల్ చేసి, పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్లు ఉండటం వల్లే అలా జరిగిందన్నారట. నీ తప్పు ఏమీ లేదని చెప్పారట. శేఖర్ మాస్టర్ మాటతో ఆమె మనసు కుదుట పడినట్లు వివరించింది.
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం
తనకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు డ్యాన్స్ నేర్చుకోవడం అలవాటుగా మారిపోయిందని శ్రీలీల చెప్పింది. అమ్మ ప్రొత్సాహంతోనే భరత నాట్యం నేర్చుకున్నట్లు వెల్లడించింది. స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా, తాను తప్పకుండా డ్యాన్స్ చేసేదని చెప్పింది. కొన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్లకు బొబ్బలు వచ్చేదని చెప్పింది. ఈ కారణంగా కొన్నిసార్లు డ్యాన్స్ మానేద్దాం అనుకున్నా, అమ్మ ఒప్పుకోలేదని చెప్పింది. ఆ తర్వాత నెమ్మదిగా డ్యాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిందని వివరించింది. అదే డ్యాన్స్ ఇప్పుడు తనకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని వెల్లడించింది.
తొలి మూవీ ఆఫర్ ఎలా వచ్చిందంటే?
ఇక తన తొలి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా శ్రీలీల వివరించింది. “నా ప్రతి పుట్టినరోజు అమ్మ ఫోటో షూట్ చేయించేది. ఓసారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ భువన గౌడతో ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోలను ఆయన ఫేస్ బుక్ లో పెట్టారు. వాటిని చూసి ఓ కన్నడ డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు. స్కూల్ డేస్ లోనే సినిమాల్లోకి అడుగు పెట్టాను” అని చెప్పింది.
Read Also: ‘భగవంత్ కేసరి’ సెట్‌లో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, శ్రీలీలతో సీరియస్ డిస్కషన్ - పిక్ వైరల్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial