Actress Pavala Shyamala Video: పావలా శ్యామల. సినీ అభిమానులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాటకాల నుంచి సినిమాల వరకు మూడు దశాబ్దాలకుపైగా నటనారంగంలో రాణించింది. ఎంతో మంది అగ్రహీరోల సినిమాల్లో కనిపించింది. చిరంజీవి నుంచి మొదలు కొని నాని సినిమాల వరకు తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. కళనే జీవితంగా మార్చుకున్న పావలా శ్యామలకు ఇప్పుడు దయనీయ జీవితం గడుపుతోంది. ఇంటి కిరాయి కట్టడానికి కూడా డబ్బులు లేక అనాథ ఆశ్రమంలో బతుకీడుస్తోంది.
నటి శ్యామలాకు పలువురు ఆర్థిక సాయం
గత కొంత కాలంగా పావలా శ్యామల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒకరకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె దీన స్థితి వివరిస్తూ ఆర్థికసాయం చేయాలని పలువురు కోరుతూనే ఉన్నారు. తాజాగా నటుడు కాదండరి కిరణ్ ఆమె గురించి తెలుసుకుని మనం స్వచ్ఛందం సేవా సంస్థ తరఫున ఆమెకు రూ. 25 వేల ఆర్థిక సాయం చేశారు. గతంలోనే ఈమె దీని స్థితి గురించి తెలుసుకున్న కేసీఆర్, అప్పట్లో ఆమెకు అండగా నిలుస్తామని చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపంచుకుని పావలా శ్యామలతో మాట్లాడారు. తక్షణ సాయం కింద రూ. 20 వేలు ఇప్పించడమే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున నెలకు రూ. 10 వేల పింఛన్ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్న శ్యామలాకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వంతో పాటు పలువురు దాతలు ఆమెకు అప్పట్లో సాయం చేశారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా రూ.20 వేలు అందించారు. ఆమె బ్యాంక్ అకౌంట్‌లో నెలకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని చెప్పారు. కానీ, ఆమె పరిస్థి ఏమాత్రం మారిపోయలేదు.
కంటతడి పెట్టిస్తున్న పావలా శ్యామలా మాటలు
తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పావలా శ్యామలను చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టారు. ఆమె మాటలు విని అయ్యోపాపం అన్నారు. తెలుగులోని అందరు అగ్రహీరోలతో నటించినా, చివరకు తన బతుకు ఇలా మారిపోయిందంటూ ఆమె చెప్పిన మాటలు ఆవేదన కలిగించాయి. “తెలుగులో అందరు హీరోలతో నటించాను. ఎన్నో హిట్ సినిమాలు చేశాను. కానీ, నా బతుకు ఇలా అవుతుందని భావించలేదు. ఇలా దుర్భరంగా బతకాల్సి వస్తుందనుకోను. నా కష్టాలు, కన్నీళ్లు మీకు చెప్పుకుని బాధ పెట్టాలని రాలేదు. నేను బతికి ఉండి మళ్లీ మిమ్మల్ని చూస్తానో? లేదో? అనే భయంతో వచ్చాను. ఒక్కసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని వచ్చాను” అని పావలా శ్యామలా కంటతడి పెట్టింది. ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎలాంటి శ్యామల ఎలా అయిపోయింది? అని నెటిజన్లు బాధపడుతున్నారు.