Surekha Vani about Drugs Case: ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి.. ఏడాదికి కనీసం అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. దాదాపు తెలుగులోని అందరు స్టార్ హీరోలతో నటించారు. కానీ ఇప్పుడు ఆమె సినిమాలు చేసే స్పీడ్ తగ్గిపోయింది. అయినా కూడా రేంజ్ రోవర్ లాంటి కారు కొనుక్కొని విలాసవంతమైన జీవితం గడపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దానిపై సురేఖా వాణి తాజాగా స్పందించారు. అంతే కాకుండా కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు బయటికి వచ్చింది. ఇన్నాళ్ల తర్వాత దానిపై క్లియర్‌గా క్లారిటీ ఇచ్చేశారు సురేఖా. 


కామన్ ఫ్రెండ్ మాత్రమే..


భర్త లేకపోయినా, సినిమాలు తగ్గిపోయినా విలాసవంతమైన జీవితం గడపడంపై సురేఖా వాణిని చాలామంది విమర్శిస్తున్నారు. వారందరికీ ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చేశారు ఈ సీనియర్ ఆర్టిస్ట్. తనకు ఇప్పటివరకు సొంత ఇల్లే లేదని, పాత బీఎమ్‌డబ్ల్యూ కారును అమ్మేసి సెకండ్ హ్యాండ్‌లో ఈఎమ్‌ఐలో రేంజ్ రోవర్ కొన్నామని తెలిపారు. ఇక కేపీ చౌదరీ డ్రగ్స్ కేసుపై మాట్లాడుతూ.. ‘‘తను మా అందరికీ కామన్ ఫ్రెండ్. మేము మామూలుగా పార్టీల్లో కలిసేవాళ్లం. తన ఫోన్‌లో నా ఫోటోల కంటే వేరే ఆర్టిస్టుల ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు 300 మంది ఫోటోలు ఉంటే ముగ్గురి ఫోటోలు మాత్రమే బయటికొచ్చాయి. అందులో నా ఫోటో కూడా బయటికి తీశారు. ఫోటోలు వేయడం వల్ల అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దాని వల్ల నాకు మానసికంగా ఒత్తిడి పెరిగిపోయింది’’ అని తెలిపారు సురేఖా వాణి.


డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను..


ఎక్కడ డ్రగ్స్ కేసు జరిగినా కూడా సినిమా వాళ్లను టార్గెట్ చేస్తున్నారని వాపోయారు సురేఖా వాణి. ముఖ్యంగా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణ వల్ల దాదాపు నెలరోజులు సరిగా తినలేదని, డిప్రెషన్‌లో ఉన్నానని బయటపెట్టారు. ఆ సమయంలో తనకు ఎవరూ సపోర్ట్ కూడా లేరని అన్నారు. తన కూతురితో కలిసి కూర్చొని ఏడ్చానని గుర్తుచేసుకున్నారు. అన్ని కాదని, కేవలం ఒక్క ఛానెల్ మాత్రమే అదే పనిగా తన గురించి తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. అందుకే తాను కూడా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా కూడా చాలామంది ఈ విషయాన్ని వదిలేయమని సలహా ఇచ్చారని అన్నారు. అదే సమయంలో తను అమెరికా వెళ్తే పారిపోయిందని అన్నారని వాపోయారు. ఆ ట్రిప్ వల్లే తను ఆ ఘటన నుండి బయటికి వచ్చానని చెప్పారు.


అది మాత్రమే కోరుకుంటాను..


ఇక తన కూతురు సుప్రితతో పాటు సురేఖా వాణి డ్రెస్సింగ్ గురించి కూడా విమర్శలు తరచుగా వినిపిస్తుంటాయి. దానిపై స్పందిస్తూ.. ఎవరికి నచ్చినట్టు వారిని ఉండనివ్వండి, ఎవరికి నచ్చిన బట్టలు వారిని వేసుకోనివ్వండి అంటూ సింపుల్‌గా సమాధానమిచ్చారు సురేాఖ వాణి. రెండో పెళ్లి, రిలేషన్‌షిప్ లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని అడగగా.. రిలేషన్‌షిప్‌ అంటేనే భయమేస్తుందని, వాటిపై నమ్మకం లేదని అన్నారు. దేవుడంటే సురేఖా వాణికి చాలా నమ్మకం, ఎప్పుడూ దేవాలయాలకు కూడా వెళ్తుంటారు. అలా వెళ్లిన ప్రతీసారి తనకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వమని, తనవాళ్లను చూసుకునే ధైర్యాన్ని ఇవ్వమని కోరుకుంటానని బయటపెట్టారు. సినిమాలు మానేసిందని రూమర్స్ వైరల్ అవ్వడం వల్లే తనకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదని తెలిపారు. పాత హీరోయిన్లు మళ్లీ రావడం వల్ల కూడా తనకు అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు.


Also Read: అమర్యాదగా అనిపించవచ్చు - ఆర్పీ పట్నాయక్‌కు సారీ చెప్పిన విశ్వక్ సేన్