Director Surya Kiran About Ex Wife Kalyani: తెలుగు సినీ అభిమానులకు సూర్య కిరణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
బాల నటుడిగా 200 చిత్రాలు చేసిన సూర్య కిరణ్
సూర్య కిరణ్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత సహాయన నటుడిగా కనిపించాడు. తెలుగులో ‘సత్యం’ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించారు. ‘సత్యం’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో అటు సుమంత్ కు, ఇటు సూర్య కిరణ్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా మిగిలిపోయింది. ‘సత్యం’ తర్వాత ‘ధన 51’, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజు భాయ్’, ‘చాప్టర్-6’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ సీజన్-4 లోనూ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు.
కల్యాణితో ప్రేమ వివాహం, విడాకులు
టిఎస్.మణి, రాధా దంపతులకు సూర్య కిరణ్ జన్మించారు. చెన్నైలోనే పుట్టిన ఆయన అక్కడే పెరిగారు. వీళ్ల సొంతూరు కేరళలోని తిరువనంతపురం. సూర్య కిరణ్ సోదరి సుజిత తమిళ, తెలుగు సినిమాలతో పాటు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. హీరోయిన్ కల్యాణిని సూర్య కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య కిరణ్.. పెళ్లి గురించి, తన భార్య కల్యాణి గురించి కీలక విషయాలు చెప్పారు.
“విడాకుల తర్వాత తన గురించి మాట్లాడొద్దని కల్యాణి చెప్పారు. ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో తన గురించి చెప్పాను. ఆమె మా మేనేజర్ కు ఫోన్ చేసి తిట్టారు. మేం విడాకులు తీసుకున్నాం కదా.. మళ్లీ నా గురించి మాట్లాడ్డం ఎందుకు? అని అడిగారు. అందుకే నేను ఆమె గురించి మాట్లాడలేను. మాట్లాడ్డం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నిజానికి పెళ్లి అనేది పంజరంలో ఉన్న పావురం లాంటిది. బయట ఉన్న వాళ్లు ఎప్పుడు లోపలికి వెళ్దామా? అనిపిస్తుంది. లోపల ఉన్న వారికి ఎప్పుడు బయటకు పోదామా? అనిపిస్తుంది. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల కోసం అయినా కలిసి ఉండక తప్పదు. విడాకులు తీసుకున్న తర్వాత కల్యాణితో మాట్లాడలేదు. ఆమె కూడా నాతో మాట్లాడలేదు. ఎవరి దారిన వాళ్లం బతుకుతున్నాం” అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు.