Jeyamohan On Manjummel Boys: ఈ ఏడాది మలయాళం సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’.  చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపురూప స్పందన లభించింది. దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. పలు చోట్ల థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘2018’ కొనసాగుతుండగా, త్వరలో ఆ రికార్డును ‘మంజుమ్మెల్ బాయ్స్’ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాను చూసి పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ తమిళ రచయిత ఈ చిత్రంపై తీవ్ర విమర్శలు చేయడం సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.


అదో చెత్త సినిమా- వాళ్లంతా తాగుబోతులు!


‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాను 2006లో కొడైకెనాల్ గుహలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో యువకులు తాగుతూ, జల్సాగా గడుపుతూ పెద్ద ప్రమాదానికి కారణం అవుతారు. ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని తమిళ రచయిత జయ మోహన్ ఈ చిత్రంపై  తీవ్ర విమర్శలు చేశారు. కేరళ యుకులంతా ఇలాగే ఉంటారని చెప్పుకొచ్చారు. వాళ్లంతా మలయాళీ లోఫర్స్, తాగుబోతులు అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. తాను కూడా సినిమా పరిశ్రమకు చెందిన వాడిని కావడం వల్ల  ఇతర సినిమాల గురించి  పెద్దగా విమర్శలు చేయనని తెలిపారు.


‘ది ఎలిఫెంట్ డాక్టర్’ అనే పుస్తక రచయితగా ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేనన్నారు. కేరళ అడవులలో అక్కడి యువకులు తాగి పారేసిన మందు బాటిల్స్ పగిలి గుచ్చుకుని ఏనుగులు ఎలా చనిపోతున్నాయో? ఆ పుస్తకంలో వివరించారు జయ మోహన్. మలయాళీ టూరిస్టులు ఎక్కడికెళ్లినా అలాంటి పనులే చేస్తారని విమర్శించారు. తాగి నిషేధిత ప్రాంతానికి వెళ్లి లోయలో పడిపోయిన ఘటనను గొప్పగా చూపించడం ఓ చెత్త పని, అదో చెత్త సినిమా అంటూ మండిపడ్డారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ నా దృష్టిలో ఓ పనికిమాలిన సినిమా అన్నారు జయమోహన్. కేరళ వాళ్లు ఎక్కడికి వెళ్లినా, తాగడం, ఊగడం, పడిపోవడమే వాళ్ల పని అన్నారు.   


జయమోహన్ వ్యాఖ్యల తీవ్రపై విమర్శలు


అటు జయమోహన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను కేరళ వాసులందరికీ వర్తింపజేసి మాట్లాడ్డం మంచిది కాదంటూ కేరళ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన విమర్శలను జాత్యహంకారానికి నిదర్శనం అని మండిపడుతున్నారు. 2006లో తమిళనాడు కొడైకెనాల్​ గుణ గుహల్లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంత మంది స్నేహితులు టూర్ లో భాగంగా కొడైకెనాల్ వెళ్లగా, అందులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నాన్ని దర్శకుడు సినిమాగా తెరకెక్కించారు. రెస్క్యూ సిబ్బంది సైతం కాపాడలేమని చెప్పినా, తమ స్నేహితులు అతడిని ఎలా కాపాడుకున్నారో ఇందులో  చూపించారు.  


Read Also: కుమారి ఆంటీనా మజాకా - సీరియల్స్‌‌‌లో ఎంట్రీ, వైరల్ అవుతున్న ప్రోమో