సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం'. ఏ ముహార్తాన ఈ సినిమాని మొదలుపెట్టారో కానీ, మొదటి నుంచీ ఏదొక రూపంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. కథలో మార్పులు జరగడం, షూటింగ్ క్యాన్సిల్ అవడం, షెడ్యూల్స్ వాయిదా పడటం, హీరోయిన్లు మారడం, టెక్నీషియన్లు తప్పుకోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా సినిమాటోగ్రాఫర్ ను మారుస్తున్నారనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ కొత్త డీఓపీగా మనోజ్ పరమహంస తాజాగా టీమ్ లో జాయిన్ అయ్యారు. 


SSMB28 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఆర్. మధి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లే సమయానికి అతని స్థానంలోకి సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ వచ్చి చేరాడు. అయితే కొంతభాగం షూటింగ్ జరిగిన తర్వాత డీఓపీని మార్చబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. తప్పించారా? ఆయనే తప్పుకున్నారా? అనేది తెలియదు కానీ.. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వచ్చిన 'గుంటూరు కారం' స్పెషల్ పోస్టర్ లో వినోద్ పేరు కనిపించలేదు. దీంతో సినిమాటోగ్రాఫర్ మార్పుపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఎవరిని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తారని ఆలోచిస్తున్న తరుణంలో, ఫైనల్ గా మనోజ్ పరమహంసకే త్రివిక్రమ్ అండ్ టీమ్ ఓటేసినట్లు తెలుస్తోంది. 


Also Read: ‘తని ఒరువన్ 2’ ప్రకటనకు వేళాయే - రామ్ చరణ్ ‘ధృవ 2’ సంగతేంటి రాజా?


మహేష్ బాబు ఇటీవల లండన్ వెకేషన్ ను పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగొచ్చిన నేపథ్యంలో.. ఈరోజు (ఆగస్టు 16) హైదరాబాద్ లో 'గుంటూరు కారం' కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు. మనోజ్ పరమహంస నేతృత్వంలోనే ఈ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ తో మ్యూజిక్ వీడియోని షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక మనోజ్ పరమహంస విషయానికొస్తే, గత 14 ఏళ్లుగా దక్షిణాది సినిమాలకు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఏమాయ చేసావే' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఛాయాగ్రాహకుడు.. 'రేసుగుర్రం' 'కిక్ 2' 'బ్రూస్ లీ' 'రాధేశ్యామ్' 'బీస్ట్' 'ప్రిన్స్' వంటి సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. వాటిల్లో కొన్ని మూవీస్ ప్లాప్ అయినా పరమహంస కెమెరా పనితనానికి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న 'లియో' సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 'గుంటూరు కారం' సెట్స్ లో అడుగుపెట్టారు. మనోజ్ పరమహంస గతంలో మహేష్ - త్రివిక్రమ్ లతో కలిసి పని చేయలేదు. మరి తొలిసారిగా సెట్ అయిన వీరి కలయికలో ఎలాంటి ఔట్ ఫుట్ వస్తుందో వేచి చూడాలి. 


కాగా, 'గుంటూరు కారం' అనేది మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. ఇందులో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Also Read: షారుఖ్ ఇంటి ముందు 'జవాన్' వాల్ ఆర్ట్ క్రియేట్ చేసిన కింగ్ ఖాన్ ఫ్యాన్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial