కొన్నిసార్లు స్టార్ హీరోలు అయినా సరే.. ఫ్యాన్స్ మాట వినాలి. లేకపోతే కష్టపడి తెరకెక్కించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నష్టాలు చవిచూడాల్సిందే. ఫ్యాన్స్‌ను తృప్తిపరచలేని భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడం చూసే ఉంటాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’కు కూడా అదే పరిస్థితి వచ్చింది. అసలు ఇంకా రీమేక్స్ వద్దు అని ఫ్యాన్స్ ఎంత వేడుకున్నా మెగాస్టార్ వినలేదు. మేకర్స్‌పై గుడ్డి నమ్మకంతో మరో రీమేక్‌కు ఒప్పుకున్నారు. పోనీ ఆ మూవీలో విషయం ఉందా అంటే.. అదీ లేదు. దీంతో ఫ్యాన్స్‌లో అసహనం ఎక్కువైపోయింది. చిరు అభిమానులే తనను సపోర్ట్ చేయకపోవడంతో సాధారణ ఆడియన్స్‌కు కూడా ఈ మూవీపై ఎలాంటి ఆసక్తి కలగలేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘భోళా శంకర్’ షేర్స్ చూస్తుంటే మూవీ ఏ రేంజ్‌లో అందరినీ డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతోంది.


వర్కవుట్ అవ్వని లాంగ్ వీకెండ్..
‘భోళా శంకర్’ను హిట్ చేయడం కోసం మూవీ టీమ్ అంతా విశ్వప్రయత్నాలు చేసింది. హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. దర్శక నిర్మాతలు కూడా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నారు. సినిమాలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉంటాయని మాటిచ్చారు. కానీ వారు ఎంత ప్రమోషన్ చేసినా.. ఆడియన్స్‌లో ‘భోళా శంకర్’పై ఆసక్తి మాత్రం కలగలేదు. ఏ మాత్రం హైప్ లేకుండా విడుదల అవ్వడంతో రెండోరోజు నుండే థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి సినిమా ఫ్లాప్ అని అందరికీ అర్థమయిపోయింది. ఆగస్ట్ 11న విడుదలయిన ఈ చిత్రానికి లాంగ్ వీకెండ్ కూడా ఏ మాత్రం సపోర్ట్ చేయలేకపోయింది. లాంగ్ వీకెండ్ వల్ల సినిమాకు కనీస లాభాలు వస్తాయని ఆశించిన ఫ్యాన్స్‌కు కూడా నిరాశే ఎదురయ్యింది.


కలెక్షన్స్ విషయంలో డీలా..
ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాకు జీరో షేర్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకు జీరో షేర్స్ అనేది కొంచెం షాకింగ్‌గానే ఉన్నా.. రీమేక్స్ వద్దని చెప్పినా ఫ్యాన్స్ మాట వినకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు రిజల్ట్ అలాగే ఉంటుంది మరీ.. అని ఇండస్ట్రీ నిపుణులు విమర్శిస్తున్నారు. ‘భోళా శంకర్’ విడుదలయిన ఆరవ రోజుకే పూర్తిగా క్రాష్ అయిపోయి నష్టాల్లోకి పడిపోయింది. అంటే ఏ రకంగా కూడా సినిమాకు షేర్స్ వచ్చే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ‘భోళా శంకర్’కు రూ.26 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇంత దారుణమైన కలెక్షన్స్ సాధించింది ‘భోళా శంకర్’ మాత్రమే.


తెలుగు సినీ చరిత్రలో జరగలేదు..
మామూలుగా ‘భోళా శంకర్’ ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.76 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. కానీ వారు ఊహించిన దానిలో కనీసం సగం కూడా కలెక్షన్స్ రాకపోవడంతో మూవీ టీమ్ అంతా దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వడానికి సిద్దంగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించలేదు ‘భోళా శంకర్’. పీ అండ్ పీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.60 కోట్ల నష్టం వచ్చింది. అసలు తెలుగు సినీ చరిత్రలో ఇలా ఏ సినిమాకు జరగలేదు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశతో పాటు ఆగ్రహంతో ఉన్నారు. ఇకపై అయినా రీమేక్స్ వద్దని ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రీమేక్‌కు చిరంజీవి తగిన సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. 


Also Read: 2024లో ఏపీ సీఎం ఆయనే - పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial