బాలీవుడ్ క్యూటీ అలియా భట్‌ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ సినిమాతో వెస్ట్రన్ ఆడియన్స్‌ ను పలకరించింది. బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్నప్పటికీ  హాలీవుడ్ మూవీ చేసి అలరించింది. ఈ సినిమాలో ఆలియా యాక్షన్ రోల్‌లో నటించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలోనే యాక్షన్‌ సీన్స్‌ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక యాక్షన్ థ్రిల్లర్ లో  గాల్ గాడోట్, జామీ డోర్నన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఆగష్టు 11న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

    


గాల్ గడోట్‌తో కలిసి ప్రమోషన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే?   


తాజాగా ఆలియా భట్ ఇన్ స్టాలో తన అభిమానులతో మాట్లాడింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.  #AskMeAnything పేరుతో నిర్వహించిన ఈ సెషన్‌లో, అలియా భట్ తన తోటి నటి గాల్ గాడోట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’ను ఎందుకు ప్రమోట్ చేయలేదనే విషయాన్ని నెటిజన్ లు ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు ఆమె వివరణ ఇచ్చింది.  ప్రమోషన్ లో తాము కలిసి పాల్గొనక పోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించింది. “ఒక నటిగా SAG-AFTRA సమ్మెకు మద్దతు ఇస్తాను. అందులో భాగంగానే మేము కలిసి ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు. అయినప్పటికీ ప్రేక్షకులు చక్కటి ప్రేమను కనబర్చారు. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని చెప్పింది. 


‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’ కథ ఏంటంటే?


రేచెల్ స్టోన్ (గాల్ గాడోట్) బ్రిటిష్ గూఢచార సంస్థ ఎంఐ6లో స్పై. కానీ రహస్యంగా ‘ది ఛార్టర్’ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కోసం పని చేస్తూ ఉంటుంది. ఒక మిషన్ మీద రేచెల్ స్టోన్ తన ఎంఐ6 టీమ్‌తో ఇటలీ వెళ్తుంది. కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. దీంతోపాటు ఎంఐ6 కమ్యూనికేషన్ సిస్టంలోకి ఒక గుర్తు తెలియని యువతి (ఆలియా భట్) ఎంటర్ అవుతుంది. ఆ యువతి ఎవరో తెలుసుకోవడానికి రేచెల్ స్టోన్... ఛార్టర్ సాయం తీసుకుంటుంది. అప్పుడు తనను భారతదేశంలోని పుణేకు చెందిన 22 సంవత్సరాల కేయా ధావన్‌గా గుర్తిస్తారు. ‘హార్ట్’ అనే డివైస్ ద్వారా ఛార్టర్ ఏజెన్సీ తమ మిషన్స్‌లో విజయం సాధిస్తూ ఉంటుంది. ఒక పనిని ఎలా చేస్తే అందులో 100 శాతం విజయం లభిస్తుందో ఈ ‘హార్ట్’ ముందుగానే చెబుతుంది. దీనికి మరింత ట్రైనింగ్ ఇస్తే ఇది భవిష్యత్తును కూడా కచ్చితంగా అంచనా వేస్తుందని తెలుస్తోంది. దీని కోసమే కేయా ధావన్ వచ్చిందని తెలుసుకున్న రేచెల్ ఏం చేసింది? ‘హార్ట్’ కేయా ధావన్‌కి చిక్కిందా? అనేది ఈ చిత్రంలో చూపించారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా  హాలీవుడ్‌లో సెటిల్ కాగా, దీపికా పదుకొణె,  ధనుష్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా ఆలియా భట్ కూడా హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే, ఆమెకు ఈ సినిమా సాలిడ్ బూస్టింగ్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు.    


Read Also: నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న ధోనీ, విజయ్ చిత్రంలో విలన్ పాత్ర?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial