ఒక్కొక్కసారి నెటిజన్లు భావ ప్రకటన స్వేచ్ఛను చాలా తప్పుగా ఉపయోగిస్తుంటారు. ఎవరి గురించి అయినా, ఎలా అయినా మాట్లాడే హక్కు వారికి ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ చేసే విషయంలో, వారి పర్సనల్ లైఫ్ గురించి తప్పుగా సమాచారం వైరల్ చేసే విషయంలో కొంతమంది ముందుంటారు. కొందరు సెలబ్రిటీలు ఇలాంటి వారితో మనకు ఎందుకులే అని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కానీ మరికొందరు మాత్రం వీరికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. తాజాగా మలయాళ హీరో టోవినో థామస్ కూడా అలాగే నిర్ణయించుకున్నాడు. అందుకే ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు పెట్టడానికి ముందుకొచ్చాడు.


పోలీసుల హామీ..
పానంగాడు పోలీస్ స్టేషన్‌లో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు నమోదు చేసి తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టోవినో థామస్ ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి పదేపదే తనను అవమానపరుస్తూ పోస్టులు పెడుతున్నాడని టోవినో.. పోలీసులకు తెలిపాడు. చాలారోజులుగా ఆ యూజర్ ప్రవర్తనను తాను గమనిస్తున్నానని చెప్పినట్టు సమాచారం. ఆ వ్యక్తిపై టోవినో థామస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు వెంటనే ఈ విషయంపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. తనపై చేసిన పోస్టులకు సంబంధించిన లింక్స్‌ను, ఇతర ఆధారాలను టోవినో పోలీసులకు అందించాడట. పోలీసులు కూడా ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని, కచ్చితంగా ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


ఆగ్రహంలో ఫ్యాన్స్..
టోవినో థామస్‌పై అలాంటి పోస్టులు పెట్టి, ఇబ్బంది పెట్టిన ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు అనే విషయాన్ని బయటికి రానివ్వలేదు పోలీసులు. ఆ వ్యక్తి ప్రవర్తనను టోవినో కొంతవరకు భరించినా.. చాలారోజులుగా ఇదే తంతు కొనసాగడంతో పోలీసులకు ఆశ్రయించక తప్పలేదని సన్నిహితులు చెప్తున్నారు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న టోవినోను ఇంతలా వేధిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు అని తెలుసుకోవడానికి తన ఫ్యాన్స్ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు టోవినో థామస్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా.. ‘2018’ చిత్రంతో దక్షిణాది సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటికే టొవినో ‘మిన్నల్ మురళి’తోపాటు మరికొన్ని మలయాళ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.


అప్‌కమింగ్ చిత్రాలు..
ప్రస్తుతం టోవినో థామస్.. జితిన్ లాల్ అనే కొత్త దర్శకుడితో కలిసి ‘అజయంటే రండమ్ మోషనమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్‌లో కొనసాగుతుందని సమాచారం. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో టోవినో థామస్‌కు జోడీగా కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి నటిస్తున్నారు. ‘అజయంటే రండమ్ మోషనమ్’ తర్వాత సౌబిన్ షాహిర్‌తో కలిసి ‘నడిగర్ తిలగం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు టోవినో. ఈ చిత్రంతో మైత్రీ మూవీ మేకర్స్.. మాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ.. కోట్లలో లాభాలు వెనకేసుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్.. మలయాళ పరిశ్రమలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. దానికోసం మినిమమ్ గ్యారెంటీ హీరో అయిన టోవినో థామస్‌ను ఎంపిక చేసుకుంది.


Also Read: ‘అందుకే పవన్ నిన్ను తన్ని తరిమేశాడు’ అంటూ నెటిజన్ కామెంట్ - రేణూ దేశాయ్ ఘాటు రిప్లై


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial