బాలీవుడ్ లో ‘డాన్’ సిరీస్ లో వస్తున్న సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ హీరోలుగా ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలతో వారికి కెరీర్ మరింత సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ‘డాన్3’ మూవీ తెరకెక్కించబోతున్నట్లు బాలీవుడ్‌ నటుడు,  డైరెక్టర్‌ ఫర్హాన్‌ అక్తర్‌ వెల్లడించారు. తాజా చిత్రంలో రణ్ వీర్ సింగ్ ను హీరోగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘డాన్ 3’లో రణ్ వీర్ హీరో ఏంటి? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.   


విమర్శలకు వివరణ ఇచ్చిన దర్శకుడు ఫర్హాన్


ఈ విమర్శలపై తాజాగా ఫర్హాన్ అక్తర్ స్పందించారు. ‘డాన్2’ సమయంలోనూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నట్లు వివరించారు. కానీ, సినిమా విడుదలయ్యాక అందరి నోళ్లు మూతబడ్డాయన్నారు.  “‘డాన్‌2’ ప్రకటన సమయంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. షారుక్‌ ఖాన్‌ ను హీరోగా తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు.  అమితాబ్‌ ను కాదని షారుఖ్ ను ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. వారి విమర్శలను పట్టించుకోకుండా ‘డాన్‌2’ను రూపొందించాం. సినిమా విడుదలయ్యాక షారుఖ్ నటనపై ప్రశంసలు కురిపించారు. షారుఖ్ నిజమైన డాన్ లా కనిపించాడని తిట్టిన వాళ్లే పొగిడారు. ఇప్పుడు కూడా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ‘డాన్3’లో రణ్ వీర్ ను తీసుకున్నట్లు ప్రకటించగానే ట్రోలింగ్ మొదలు పెట్టారు. కానీ, ఆయన చాలా మంచి నటుడు. ఈ చిత్రంలో అద్భుతంగా నటిస్తాడనే నమ్మకం ఉంది. ‘డాన్3’లో నటించేందుకు తను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అదే సమయంలో కాస్త భయం కూడా ఉంది. ఈ సినిమాలో ఆయన తన పాత్రకు కచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపొందించే బాధ్యత నామీద ఉంది” అని వివరించారు.   


‘డాన్3’ షూటింగ్ పై ఫర్హాన్ క్లారిటీ


‘డాన్‌ 3’ మూవీ షూటింగ్ గురించి కూడా ఫర్హాన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలు కాదని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో షూటింగ్ షురూ అవుతుందన్నారు. ఇప్పటి వరకు నటీనటుల ఎంపిక మొదలు కాలేదన్నారు. త్వరలోనే  ఆ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ‘డాన్’ సిరీస్ లో వచ్చిన గత సినిమాల కంటే ఈ సినిమా అద్భుతంగా ఉండేలా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. ఈ సినిమాకు ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.


‘డాన్’ సిరీస్ కు భారీ సంఖ్యలో అభిమానులు


‘డాన్’ సిరీస్‌ కు  పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.  ఈ సిరీస్‌ లో భాగంగానే రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ని తెరకెక్కిస్తున్నట్లు రీసెంట్ గా వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి రణ్ వీర్ సింగ్ ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు. అయితే, ప్రతిష్టాత్మక సిరీస్ లో రణవీర్ సింగ్ ను హీరోగా తీసుకోవడం పట్ల విమర్శలు వచ్చాయి. తాజాగా ఫర్హాన్ వివరణతో ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.






Read Also: దళితులపై ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు, కర్నాటక హైకోర్టు ఏం చెప్పిందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial