'గాడ్ ఫాదర్' (Godfather) రషెష్ చూసిన సంగీత దర్శకుడు తమన్ (Thaman), ఈ సినిమాకు ఆ టైటిల్ అయితే బావుంటుందని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ టైటిల్ కన్ఫర్మ్ చేయడానికి కొంత సందేహించినా... 'ఘరానా మొగుడు', 'గ్యాంగ్ లీడర్' సినిమాలు హిట్ అని, 'గాడ్ ఫాదర్' టైటిల్ కూడా 'జి'తో స్టార్ట్ అవుతుందని సెంటిమెంట్‌తో కొట్టడంతో తమన్ చెప్పారట. అంతే కాదు... 'గ్యాంగ్ లీడర్' టైటిల్ చివర 'ఆర్' వచ్చిందని, 'గాడ్ ఫాదర్' టైటిల్ చివర కూడా 'ఆర్' వస్తుందని చెప్పడంతో మెగాస్టార్ వెంటనే ఓకే చేసేశారు. అయితే... అసలు కథ ఆ తర్వాత మొదలైంది.
మెగాస్టార్ కోసం టైటిల్ ఇచ్చిన సంపత్ నంది!
'గాడ్ ఫాదర్' టైటిల్ చిరంజీవి ఓకే చేసేశారు. యూనిట్ అందరూ ఆ టైటిల్ ఓకే అంటూ ఓటు వేసేశారు. చూస్తే... ఆ టైటిల్ దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మాణంలో చేయబోయే సినిమా కోసం రిజిస్టర్ చేయించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మూవీ కోసం కావాలని అడగడంతో వెంటనే ఇచ్చేశారు. టైటిల్ ఈజీగా వచ్చేసిందని హ్యాపీగా ఫీలైతే... ఆ తర్వాత మరో సమస్య వచ్చింది.
నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరికి
పారామౌంట్ కంపెనీ నుంచి నోటీసులు!
'గాడ్ ఫాదర్' టైటిల్‌కు హిస్టరీ ఉంది. హాలీవుడ్‌లో ఈ టైటిల్‌తో వచ్చిన సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమా నిర్మించిన పారామౌంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ 'గాడ్ ఫాదర్' టైటిల్ మీద ట్రేడ్ మార్క్ రైట్స్ రిజిస్టర్ చేయించుకుంది. అది ఆ హాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఇండియాలో కూడా 1990లో టైటిల్ రిజిస్టర్ చేయించింది. అది హిందీలో మాత్రమే! చిరంజీవి సినిమాకు 'గాడ్ ఫాదర్' టైటిల్ పెట్టారని తెలిసి నిర్మాతలకు నోటీసులు పంపించింది.
''తమన్ టైటిల్ పెడితే బావుంటుందని ఈజీగా చెప్పేశారు. అయితే... ఫారిన్ కంపెనీ ఢిల్లీ లాయర్స్ ద్వారా నెల రోజుల ముందు నోటీసులు పంపింది. అసలు... తిరుపతిలో మా ఇంటి అడ్రస్, చెన్నైలో ఆర్బీ చౌదరి గారి అడ్రస్ ఎలా వాళ్ళకు లభించిందో అర్థం కాలేదు. మాకు నోటీసులు పంపారు. ఆ తర్వాత వాళ్ళతో చర్చలు ప్రారంభించాం. అప్పుడు హిందీలో 'మెగాస్టార్ గాడ్ ఫాదర్' అని చేంజ్ చేశాం. విదేశాల్లో 'గాడ్ ఫాదర్' టైటిల్ వాడకూడదని చెప్పారు. అక్కడ 'మెగాస్టార్ చిరు 153 హ్యాష్ ట్యాగ్ గాడ్ ఫాదర్' అని చేంజ్ చేశాం. మా అందరి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కావాలని, లెటర్ మీద సంతకాలు చేసి ఇవ్వాలని కోరారు. అదీ చేశాం'' అని నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ (NV Prasad) తెలిపారు. లీగల్ పరమైన అంశాల్లో తమకు నిరంజన్ రెడ్డి సహాయం చేశారని ఆయన చెప్పారు. 'గాడ్ ఫాదర్'కు ముందు చిరంజీవి చేసిన 'ఆచార్య' సినిమా నిర్మాతలలో నిరంజన్ రెడ్డి ఒకరు.
Also Read : 'ఆ కామెంట్స్ పై డిస్కషన్ అనవసరం' - గరికిపాటి ఇష్యూపై చిరంజీవి రియాక్షన్!