Rishikonda Highcourt :    రిషికొండలో తవ్వకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో దాస్తోందని ఏపీ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. తవ్వకాలపై కేంద్ర అటవీ శాఖ కమిటీ వేస్తామన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. రుషికొండలో పర్యావరణ అనుమతులు, చట్టాలను ఉల్లంఘించి తవ్వకాలు జరిపారన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. .88 ఎకరాలకు అనుమతి ఇస్తే... 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కే.ఎస్‌ మూర్తి, అశ్వినీ కుమార్ హైకోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్‌‌లను న్యాయవాదులు కోర్టుకు అందజేశారు. 


అనుమతులకు మించి పదెకరాలు ఎక్కువగా తవ్వేేశారని హైకోర్టులో వాదనలు


అయితే  తాము 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే గూగుల్ మ్యాప్‌లు అబద్దాలు చెబుతాయా అని  హైకోర్టు ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. తాను అఫిడవిట్ దాఖలు చేస్తానని..  అప్పటి వరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు ఉందని న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది. మీరు అఫిడవిట్ వేసిన తరువాత నిజా, నిజాలు తేలుస్తామని చెప్పిన హైకోర్టు... తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. విచారణలో  అభివృద్ది పేరిట కొండలను కొట్టేస్తున్నారని పేర్కొంది. మరోవైపు అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని... ప్రభుత్వంలో విభిన్న వైఖరిలు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది..


కొత్తగా తవ్విన దాంట్లో ఏమీ కట్టవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశం 
 
విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్టు పేరుతో తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మిస్తున్నారని విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్‌ పీవీఎల్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేశారు. మరికొంత మంది ఎన్జీటీలో పిటిషన్ వేశారు. విచారణ జరిగిన ఎన్జీటీ తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది.  ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే రుషికొండలో తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విచాణ జరిపిన సుప్రీంకోర్టు కొత్తగా తవ్విన చోట నిర్మాణాలొద్దని ఆదేశించి.. హైకోర్టులోనే విచారణ పూర్తి చేయాలని సూచించింది. 


ఏపీ ప్రభుత్వం దాఖలు చేసే అఫిడివిట్ ఆధారంగా  హైకోర్టు నిర్ణయం 


హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరాలు అందచడం లేదని.. తవ్వకాలను కూడా తక్కువ చేసి చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం త్వరలో అఫిడవిట్ దాఖలు చేయనుంది . ఆ అఫిడవిట్‌లో ఎక్కువ తవ్వినట్లుగా తేలితే అధికారులు బాధ్యలయ్యే అవకాశం ఉంది. 


మళ్లీ ఆ కేసులన్నీ వచ్చేశాయ్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు షాకిచ్చిన సొంత ప్రభుత్వం !