PM Modi Himachal Visit:


వందేభారత్‌ ట్రైన్ ప్రారంభం..


ప్రధాని మోదీ హిమాచల్‌ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో..నాలుగో వందే భారత్ ట్రైన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించిన తరవాత...ప్రధాని ఓ సభలో పాల్గొన్నారు.  గత ప్రభుత్వాలు తీర్చని సమస్యల్ని భాజపా తీర్చుతోందని, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటోందని వెల్లడించారు. "మా ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చుతోంది. గత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాటిని అసలు పట్టించుకోలేదు" అని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందని చెప్పారు. "దీపావళి ముందే వచ్చింది. ఇవాళ నేను మరో కొత్త వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించాను. దేశంలో
అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లలో ఇది నాలుగోది" అని వెల్లడించారు. తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని..త్వరలోనే హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉనాలో ఉన్న బల్క్‌ డ్రగ్ పార్క్‌లో రూ.2వేల కోట్ల పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే తయారయ్యే అవకాశం కల్పిస్తే...మందులు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 






బల్క్ డ్రగ్ పార్క్..


"ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మెడికల్ డివైజ్ పార్క్‌, బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు" అని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఉందని వెల్లడించారు. వందే భారత్ ట్రైన్‌నూ ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు ప్రధానికి థాంక్స్ చెప్పారు జైరాం ఠాకూర్. "బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రాష్ట్రానికి రూ.15-20 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 30 వేల మంది ఉపాధి కూడా దొరుకుతుంది. ఇదంతా మోదీ వల్లే సాధ్యమైంది" అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ పర్యటనలో భాగంగానే..ప్రధాని మోదీ ఉనా జిల్లాలోని  Indian Institute of Information Technology (IIIT)ని జాతికి అంకితం చేశారు. తరవాత బల్క్ డ్రగ్ పార్క్‌కి శంకుస్థాపన చేశారు. 
 
నాలుగో ట్రైన్..


2019ఫిబ్రవరి 15న మొదటి వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైళ్లలో self-propelled engine ఉంటుంది. డీజిల్‌ను ఆదా చేయడంతో పాటు...30% విద్యుత్‌తోనే నడుస్తాయి. వందేభారత్ ట్రైన్స్‌ను సెమీ హై స్పీడ్ రైళ్లుగా చెబుతోంది ఇండియన్ రైల్వేస్. వీటిని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు. ఆటోమెటిక్ డోర్స్, AC చెయిర్ కార్, రివాల్వింగ్ చైర్‌లు అందుబాటులో ఉంటాయి. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో వెల్లడించారు. పీఎం గతిశక్తి లో భాగంగా ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను నడుపుతోంది. 


Also Read: కేంద్రం చేపట్టే నగదు బదిలీ, సంక్షేమ పథకాలపై ఐఎంఎఫ్‌ ప్రశంసలు