Russia Ukraine Conflict:
మళ్లీ దూరమెందుకో..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఆరు నెలలు దాటినా...ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇంకా పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యే క్రిమియాను రష్యాను కలిపే కీలకమైన క్రెచ్ వంతెనపై బాంబుదాడి జరగటం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. అయితే...ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా...వెనక్కి తగ్గటం లేదు పుతిన్. ఐక్యరాజ్యసమితి ఎన్నో సందర్భాల్లో రష్యాకు సూచనలు చేసినా...వాటినీ ఖాతరు చేయలేదు. అందుకే ఐరాస జనరల్ అసెంబ్లీలో పలుమార్లు ఉక్రెయిన్ ఆక్రమణపై ఓటింగ్ నిర్వహించారు. ఇటీవల మరోసారి ఓటింగ్ జరిపారు. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం చేసింది. 143 సభ్య దేశాలు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా...5 దేశాలు వ్యతిరేకించాయి. 35 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటిలో భారత్ కూడా ఉంది. అంతకు ముందు భద్రతా మండలిలోనూ ఇదే తీర్మానం ప్రవేశపెట్టగా...రష్యా "వీటో"అధికారంతో దాన్ని నిలిపివేసింది. అప్పుడు కూడా భారత్ ఓటింగ్‌కు దూరంగానే ఉంది. ఈ ఓటింగ్‌లో మెజార్టీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్య దేశాలన్నీ... ఉక్రెయిన్ ఆక్రమణను తీవ్రంగా ఖండించాయి. "రెఫరెండమ్"ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని మండి పడ్డాయి.
ఇటీవలే రష్యాకు వ్యతిరేకంగా ఓటు..
అయితే...ఇటీవలే రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసి భారత్ ఆ దేశానికి షాక్ ఇచ్చింది. రష్యా డిమాండ్‌ను తిరస్కరిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత్ ఓటు వేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, దొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. దీనిపై రికార్డెడ్ ఓటింగ్ నిర్వహించాలని కోరింది. కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో రష్యా డిమాండ్‌పై ఐరాసలో ఓటింగ్ జరిగింది. అయితే రష్యా డిమాండ్‌ను 107 దేశాలు తిరస్కరించాయి. అనూహ్యంగా వీటిల్లో భారత్ కూడా ఉంది. రికార్డెడ్ బ్యాలెట్‌కు అనుకూలంగా భారత్ ఓటు వేసింది. కేవలం 13 దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా మద్దతు తెలిపాయి. మరో 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. వీటిల్లో రష్యా, చైనా కూడాఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరించింది భారత్. ఎందుకంటే ఎప్పుడు ఆపద వచ్చిన భారత్‌కు రష్యా వెన్ను దన్నుగా నిలిచింది. అందుకే అంతర్జాతీయ వేదికలపై రష్యాను విమర్శించడం లేదా వ్యతిరేకించడం భారత్ చేయలేదు. ఈవిషయంలో ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తోంది. నేరుగా మాత్రం ఎప్పుడూ రష్యాను వెనకేసుకు రాలేదు. అలా అని ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామనీ చెప్పలేదు. ఈ మధ్య పుతిన్‌తో భేటీ అయినప్పుడు మాత్రం ప్రధాని మోదీ "ఇది యుద్ధాలు చేసుకోవాల్సిన కాలం కాదు" అని కాస్త గట్టిగానే చెప్పారు. దీనిపై పలు దేశాల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
Also Read: World Sight Day 2022: ఎక్కువ సమయంపాటూ కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ చూస్తే సైట్ వస్తుందా?