రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. బాక్సాఫీస్ బరిలో బాలీవుడ్ సినిమాలు ఒక దాని వెంట బోల్తా కొడుతున్న సమయంలో హిట్ అందుకున్న సినిమా ఏదైనా ఉందంటే... అది 'బ్రహ్మాస్త్ర' అని చెప్పాలి. ఈ విజయం హిందీ చిత్రసీమకు ఊపిరి ఇచ్చింది. భారీ వసూళ్లు సాధించింది. మూడు భాగాలుగా 'బ్రహ్మాస్త్ర' రూపొందిస్తున్నట్టు ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పుడు రెండో పార్ట్ కోసం స్టార్ హీరో వేట మొదలైంది. 


విజయ్ దేవరకొండకు 'బ్రహ్మాస్త్ర 2' ఆఫర్!
'బ్రహ్మాస్త్ర' చూస్తే... అందులో హీరో శివ ఫాదర్ దేవ్ రోల్ ఒకటి ఉంటుంది. ఆ రోల్ ఎవరు చేశారనేది చూపించలేదు. కేవలం ఒక ఆకారం మాత్రమే చూపించారు. ఆ పాత్ర కోసం స్టార్ హీరోలను సినిమా యూనిట్ అప్రోచ్ అవుతోంది. తొలుత హిందీ హీరోలను ట్రై చేశారు. హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్ దగ్గరకు వెళ్లారు. వాళ్ళిద్దరూ 'నో' చెప్పారు. ఆ తర్వాత 'కెజియఫ్' స్టార్ యష్ (Yash) ను సంప్రదించారు. ఆయన కూడా 'నో' అన్నారని టాక్. ఇప్పుడు ఆ ఆఫర్ విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. మరి, ఆయన ఏం అంటారో చూడాలి. 



కరణ్ జోహార్ కోసం 'ఓకే' అంటారా?
'బ్రహ్మాస్త్ర'కు కర్త, కర్మ, క్రియ... అంతా కరణ్ జోహార్. ఆయన ఓ నిర్మాతగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 'లైగర్' చేశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. హిందీలో సినిమాలు విడుదల చేయడానికి, కొత్త సినిమాలు రావడానికి కరణ్ జోహార్ అండ ఎవరికి అయినా అవసరమే. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలో ఏడాదికి మినిమమ్ నాలుగైదు సినిమాలు వస్తాయి. ఆయన కోసం 'బ్రహస్త్ర 2' చేయడానికి విజయ్ దేవరకొండ ఓకే అంటారా? లేదా? అనేది చూడాలి. 



సౌత్ మార్కెట్ కోసం విజయ్ దేవరకొండ దగ్గరకు?
విజయ్ దేవరకొండకు తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన్ను తీసుకుంటే సౌత్ మార్కెట్ యాడ్ అవుతుందని, దక్షిణాది ప్రేక్షకుల్లో సినిమాకు ఎక్కువ క్రేజ్ వస్తుందని 'బ్రహ్మాస్త్ర' టీమ్ ప్లాన్ వేసిందని బాలీవుడ్ టాక్. వచ్చే ఏడాది 'బ్రహ్మాస్త్ర 2' సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతానికి 2025లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  


Also Read : హిందీ యాంకర్‌కు యష్ అదిరిపోయే కౌంటర్ - సౌత్ సినిమాలను హేళన చేసిన చోట!



ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చేస్తున్నారు. అందులో సమంత (Samantha) హీరోయిన్. ఆవిడ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేశారని తెలుస్తోంది. 'లైగర్' విడుదల కంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జన గణ మణ' స్టార్ట్ చేసినప్పటికీ... 'లైగర్' డిజాస్టర్ కావడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. అక్కడ హీరోలలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉంది.