కన్నడ నామ సంవత్సరం... సినిమాల పరంగా 2022ను శాండిల్‌వుడ్ పేరు మీద రాయొచ్చు ఏమో!? ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. అయితే... కన్నడ నుంచి వచ్చిన యష్ 'కెజియఫ్ 2' (KGF 2 Movie), రిషబ్ శెట్టి 'కాంతార' (Kantara Movie), సుదీప్ 'విక్రాంత్ రోణ' కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు అందుకున్నాయి. రక్షిత్ శెట్టి 'చార్లీ 777'కి కూడా మంచి పేరు వచ్చింది. కన్నడ సినిమాలు మాత్రమే కాదు... కన్నడ హీరోల ప్రవర్తన కూడా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దక్షిణాది ప్రేక్షకుల సంగతి చెప్పనవసరం లేదు అనుకోండి!


హిందీ యాంకర్‌కు రాకీ భాయ్ కౌంటర్! 
యష్ (Yash KGF Hero) అలియాస్ రాకీ భాయ్.... ఈ మధ్య ముంబైలో సందడి చేశారు. అక్కడ ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందీలో ఫేమస్ జర్నలిస్ట్, యాంకర్ ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. 'కెజియఫ్' సినిమా, రాకీ భాయ్, కన్నడ సినిమా గురించి ప్రశ్నలు వేశారు. మధ్యలో 'కాంతార' సినిమా ప్రస్తావన వచ్చింది. మొదట 'మీ సినిమా కాంతార ఇండియా అంతటా ఇరగదీస్తోంది' అన్నారు. ఆ వెంటనే 'మీ సినిమా కాదనుకోండి' అంటూ మరో మాట మాట్లాడారు. అంటే... 'కాంతార'లో రిషబ్ శెట్టి హీరో అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే... 'కాంతార' కూడా తన సినిమా అని యష్ అన్నారు. 



''సర్... అది (కాంతార) నా సినిమా కాదని ఎవరన్నారు? అది కూడా నాదే! మా కన్నడ సినిమా అది. కన్నడలో ఏ సినిమా సక్సెస్ అయినా నేను ఎంజాయ్ చేస్తా'' అని యష్ చెప్పుకొచ్చారు. ఆయన సమాధానం యాంకర్ తో సహా అక్కడున్న ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది.
 
సౌత్ సినిమాలను హేళన చేశారు - యష్
యష్ రీసెంట్ బాలీవుడ్ ఇంటర్వ్యూలో హిందీలో సౌత్ సినిమాల విజయాలు, ఇంకా డబ్బింగ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన ఏమాత్రం తడుముకోకుండా మరింత స్ట్రైట్ గా మాట్లాడారు. ''కొన్నేళ్ల క్రితం సౌత్ సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ ఎగతాళి చేసేవారు. ఎందుకంటే మా సినిమాలను తక్కువ ధరలకు కొని... నాసిరకం డబ్బింగ్, టైటిల్స్ తో రిలీజ్ చేసేవారు. 'బాహుబలి'తో రాజమౌళి మాకు దారి చూపించారు. అప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ కూడా మా సినిమాలను ఆదరిస్తున్నారు. మా కంటెంట్ అర్థం చేసుకుంటున్నారు'' అని యష్ అన్నారు.


Also Read : సీమకు వెళ్తున్న 'వీర సింహా రెడ్డి' - అనంతపురంలో ఐదు రోజులు...



'కెజిఎఫ్ 3' ప్రస్తావన వచ్చినప్పుడు... ''అది చేయాలన్న ఆలోచన ఉంది. కానీ, అది ఇప్పుడప్పుడే కాదు'' అని యష్ తేల్చి చెప్పేశారు. మరి, తర్వాత సినిమా ఏంటని యాంకర్ అడిగినప్పుడు త్వరలోనే వివరాలు చెప్తానన్నారు.