ఆసక్తి ఉంటే నేర్చుకొనేందుకు ఏదీ అడ్డంకి కాదని నిరూపించారు.. ఈ యువతి. యూ ట్యూబ్ లో వీడియో క్లాసులు చూసి నిజామాబాద్ కు చెందిన ఓ స్టూడెంట్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ లో స్టేట్ ర్యాంక్ సాధించారు. ఎన్నో ఫీజులు కట్టి, ప్రత్యక్ష తరగతులకు హాజరయినా కూడా స్టేట్ ర్యాంకులు రావడం కష్టమైన వ్యవహారం. అలాంటిది యూ ట్యూబ్ లో విన్న క్లాసులతో ఈమె ఏకంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ ర్యాంకు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజామాబాద్ కు చెందిన ఈ యువతి సాధించిన ఘనత ఇది.


నిజామాబాద్ లోని శరత్ కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్ ఇద్దరు పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూతురు హారిక పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. హారికకు డాక్టర్ కావాలన్న కోరిక ఉన్నా నీట్ కోచింగ్ కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతి రోజూ యూట్యూబ్ లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. కాలేజీలో సీటు వచ్చినా ఫీజు, హాస్టల్, బుక్స్ ఫీజులు కలిపి కనీసం రూ.రెండు లక్షల వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతోంది. తాను ఎంబీబీఎస్ చదివేందుకు దాతలు ఆర్థిక సాయం అందించాలని హారిక వేడుకుంటోంది.