Rains in Telangana AP: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో త్వరలోనే వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మొదట నవంబర్ 8న ఈ అల్పపీడనం ఏర్పడుతుందని భావించినా.. 9న ఏర్పడుతుందని అప్ డేట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు యానాంపై దీని ప్రభావం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఆపై వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. అల్పపీడనం ఏర్పడిన 48 గంటలకు ఇది బలహీనపడి పుదుచ్చేరి, చెన్నై మధ్య నవంబర్ 11, 12 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనం తుఫానుగా మారుతుందా, లేదా సాధారణ అల్పపీడనంగానే ఉంటుందా అనే అంశంపై గురించి ఇంకా క్లారిటీ లేదని ఏపీ వెదర్ మ్యాన్ చెప్పారు. కానీ అల్పపీడనం ఏర్పడ్డాక తప్పకుండా తమిళనాడు వైపు అయినా, పుదుచ్చేరి, లేక దక్షిణ కోస్తాంధ్ర వైపు రానుందని అంచనా వేశారు. ఒకవేళ ఇది వాయుగుండంగా మారితే తమిళనాడుకి, అలాగే బలమైన తుఫానుగా ఏర్పడితే దక్షిణ కోస్తాంధ్రపై పెను ప్రభావం చూపనుందని తెలిపారు.  


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 34.8 డిగ్రీలు నమోదు కాగా, హకీంపేటలో అత్యల్పంగా 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. 






హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘాలతో కప్పేసి ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. మరోవైపు నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గాలుల కోస్తాంధ్ర వైపుగా వీస్తుండటంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.   
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వర్ష సూచ ఉంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉన్న​తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలతో ఈ సీజన్ లో అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి.