నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). ఆయన టైటిల్ రోల్ చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఫ్యాక్షన్ అంటే ప్రేక్షకులకు, ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది రాయలసీమ. ఆ సీమకు 'వీర సింహా రెడ్డి' వెళుతున్నారు.
ఐదు రోజులు అనంతపురంలో...
రాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో ఐదు రోజులు 'వీర సింహా రెడ్డి' షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. నవంబర్ 9న (శనివారం) పెన్న అహోబిళంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో... 10, 11 తేదీల్లో (ఆది, సోమ వారాల్లో) ఉరవకొండలోని అమిద్యాల, రాకెట్ల ప్రాంతాల్లో... 12, 13 తేదీల్లో పెనుకొండ కోటలో... 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణ చేయనున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది.
సీమలో బాలకృష్ణ షూటింగ్ చేస్తే సినిమా హిట్ అనేది అభిమానుల నమ్మకం. సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన చేసిన మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. బాలకృష్ణకు చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) వీరాభిమాని. నందమూరి, బాలకృష్ణ అభిమానులు కోరుకునే విధంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీస్తున్నారు.
Also Read : నేనింకా చావలేదు - ఆ వార్తలపై స్పందిస్తూ ఏడ్చేసిన సమంత
వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఫైట్!
ఈ మధ్య 'వీర సింహా రెడ్డి' కోసం బాలకృష్ణ, విలన్స్ బ్యాచ్ మీద హైదరాబాద్‌లో భారీ ఫైట్ తీశారు. సినిమాలో కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని, గూస్ బంప్స్ ఇచ్చేలా, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంటుందని తెలిసింది. గోపీచంద్ మలినేని ఆ ఫైట్ స్పెషల్‌గా ఉండేలా డిజైన్ చేశారట.
వాస్తవ ఘటనల ఆధారంగా 'వీర సింహా రెడ్డి'
ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ. 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అలాగే, 'సింహా' టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'వీర సింహా రెడ్డి'లో కూడా సింహా ఉంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ సెంటిమెంట్ మాత్రమే కాదు... సినిమాలో అద్భుతమైన కంటెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
శ్రుతీ హాసన్ (Shruti Hassan) కథానాయికగా... ఇతర పాత్రల్లో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమాలకు తమన్ సూపర్ మ్యూజిక్ అందిస్తారు. బాలకృష్ణకు 'అఖండ'కు ఆయన ఎలాంటి సంగీతం ఇచ్చారో చూశారు. అందుకని, ఈ సినిమా మ్యూజిక్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.