ప్రలోభాల కారణంగానే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలైన పాల్వాయి స్రవంతి అన్నారు. పాల్వాయి స్రవంతి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు టీఆర్ఎస్, బీజేపీ రెండూ తప్పుడు అంశాలతో జనంలోకి వెళ్లాయని, అలాగే ప్రచారం సాగించాయని స్రవంతి ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవకపోయినా, ఆయన్ను కలిసినట్లుగా ఫేక్ ఫోటోలు తయారు చేశారని ఆరోపించారు. దాన్ని విపరీతంగా ప్రచారం చేశారని అన్నారు. ఈ మార్ఫింగ్ ఫొటో తన ఎన్నికల ప్రచారంపైనా, తనకు పడే ఓట్లపైనా తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. ఈ మార్పింగ్ ఫొటో కూడా ఎన్నికల్లో తన ఓటమికి ఓ కారణమని చెప్పుకొచ్చారు.
సోమవారం రాత్రి తన సొంతూరు చండూరు మండలం ఇడికుడలో పాల్వాయి స్రవంతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఓటమికి గల కారణాలను ఆమె మీడియాకు వివరించారు.
టీఆర్ఎస్ పార్టీ ధన బలం, అంగ బలంతో మునుగోడులో మద్యం ఏరులై పారిందని పాల్వాయి స్రవంతి అన్నారు. ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలు ఏకంగా రూ.500 కోట్ల దాకా ఖర్చు చేశారని అన్నారు. డబ్బులు, లిక్కర్ పంపిణీ గురించి ఎన్నికల సంఘం అధికారులకు వివరించినా ఎవరూ స్పందించలేదని విమర్శించారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కూడా ఇలాగే నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేశాయని పేర్కొన్నారు. ఆయన విషయం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. బీజేపీ మాదిరిగానే చివరకు తమ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కోవర్టు రాజకీయాలే చేశారని అన్నారు. తనకు ద్రోహం చేసిన వెంకట్ రెడ్డిపై చర్యలు ఉంటాయో, లేదో పార్టీ అధిష్ఠానం నిర్ణయం అని స్రవంతి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగలేదని, వ్యక్తుల స్వార్థం కోసమే జరిగిందని అనన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన విధిని ఈ ఎన్నికల్లో సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని అన్నారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నల్గొండలో మునుగోడు నియోజకవర్గం ఒకటి. అలాంటి చోట కనీసం డిపాజిట్ ను కూడా దక్కించుకోలేని పరిస్థితికి చేరింది. తాజాగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఓటమి అంటే జీర్ణించుకోవడం సాధ్యమే కానీ, డిపాజిట్ గల్లంతయ్యేలా కాంగ్రెస్ ఓడిపోవడంతో పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని టీ కాంగ్రెస్ నేతల్లో ఆలోచన మొదలైంది.
డిపాజిట్ కోల్పోవడం అంటే..
ఎన్నికల్లో పోలైన ఓట్లలో చెల్లుబాటయ్యే వాటిలో 1/6 వంతు ఓట్లను అభ్యర్థులు సాధించాలి. లేకపోతే వారు డిపాజిట్ కోల్పోతారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుకుగానూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తం డిపాజిట్ చేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 16.7% శాతం ఓట్లు సాధించని అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోతారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 2,41,805 ఓట్లుండగా.. 2,25,192 ఓట్లు పోలయ్యాయి. అంటే కనీసం 37, 500 పైచిలుకు ఓట్లు అభ్యర్థి సాధించాలి. తాజాగా జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 30 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగగా.. ఏ ఒక్క రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి రాలేదు.