జీవితానికి మైలురాయిలాంటివి వివాహం. చక్కని భాగస్వామి దొరికితే జీవితం స్వర్గమే, అదే స్వార్ధపరుడో, సైకోనో దొరికితే మాత్రం అంతకన్నా నరకం ఉండదు. పెళ్లికి ముందే కొన్ని రోజులు వారితో ప్రయాణించడం వల్ల ఆ వ్యక్తులు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేయచ్చు. కొన్ని రకాల లక్షణాలు వారిలో మీరు గమనిస్తే అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోకపోవడమే ఉత్తమం. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే దూరం పెట్టాలో తెలుసుకోండి. 


యాంగ్జయిటీ పెంచేసేవాడు
పెళ్లికి ముందు అలా షికారుకో లేక డేటింగ్‌కో వెళ్లినప్పుడు అతను/ఆమెతో ఉన్నప్పుడు మీకు ప్రశాంతంగా ఉండాలి. కానీ మీతో ఉన్నంత సేపు గాభారపడుతూ, చిన్న విషయానికే అసహనం చూపిస్తూ, మిమ్మల్ని కంగారూ పెట్టేసే వ్యక్తిని దూరం పెట్టడమే మంచిది. ఇలాంటి వ్యక్తులకు ఏదీ స్థిరంగా నచ్చదు. ఎదుటివారిలో ఆందోళనను పెంచేస్తారు. 


మరీ ముందస్తు ఆలోచన
ముందు చూపు మంచిదే కానీ మరీ ముందు చూపు మాత్రం చికాకు తెప్పిస్తుంది. రేపటి గురించి ఆలోచిస్తే మంచికదా అని ఎప్పుడూ అదే ఆలోచనలో కనిపిస్తే నేటి జీవితం సంతోషం లేకుండా గడిచిపోతుంది. వీరు అన్నింటి గురించి ఇలా ఆలోచిస్తారు, ప్రతిది త్వరగా నిర్ణయించేస్తారు. ఇలాంటి వ్యక్తితో మీరు జీవితాంతం కలిసి ఉండగలరో లేదో మీరే నిర్ణయించుకోవాలి. 


తన గురించే మాట్లాడేవాడు...
తన గురించి మాత్రమే ఆలోచించుకునే స్వార్ధపరుడిని పెళ్లిచేసుకుంటే చాలా కష్టం. భాగస్వామి గురించి వీళ్లు తక్కువ ఆలోచిస్తారు. అన్నీ తమకు నచ్చినవే చేస్తారు, ఎదుటివారి భావాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ తన గురించే మాట్లాడేవ్యక్తిని ఎన్నుకోకపోవడం సర్వదా మంచిది. 


విమర్శించే వాడు
భాగస్వామి ఎలా ఉన్నా మనస్పూర్తిగా స్వీకరిస్తేనే ఆ బంధం నిలుస్తుంది. అలా కాకుండా విమర్శిస్తూ ఉంటే ఎప్పటికే దారంలా తెగిపోతుంది. మీరు పెళ్లికి ముందు మాట్లాడుతున్నప్పుడు విమర్శించే వ్యక్తా కాదా అనేది అంచనా వేయాలి. నీ డ్రెస్సేంటి ఇలా ఉంది? జడ మరోలా వేసుకోవచ్చు కదా, నీకు ఎప్పటికీ వంట చేయడం రాదేమో? ఇలాంటి సింపుల్ వ్యాఖ్యలే చేస్తారు పెళ్లికి ముందు. కానీ ప్రతి చిన్న విషయానికి విమర్శించడం మొదలైతే పెళ్లయ్యాక అవి చాలా పెద్ద విమర్శులుగా మారుతాయి. కాబట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే దూరంగా ఉండడమే బెటర్. మిమ్మల్ని ఎగతాళి చేసేవాడు, విమర్శించే వాళ్లకు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. 


తప్పు చేయననే వాడు
కాబోయే భాగస్వామి మీతో ప్రతిసారి నీతి వాక్యాలు చెబుతూ, ప్రగల్భాలు పలుకుతుంటే అతడు లేదా ఆమెను భరించడం కష్టమని అర్థం. జీవితాంతం నీతులు చెబుతూ విమర్శిస్తూనే ఉంటారని కూడా అర్థం చేసుకోవాలి. ‘నేనెప్పుడూ తప్పు చేయను’ అంటూ గొప్పలు చెప్పుకునే వ్యక్తితో జీవించడం చాలా కష్టం. ఏ వ్యక్తి తప్పుచేయకుండా ఉండడు. అతను తప్పు చేసినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎత్తి చూపినా పెద్ద రాద్ధాంతం చేస్తారు ఇలాంటి మనుషులు. 


అతిగా స్పందించేతత్వం..
ప్రతి సందర్భంలోనూ అతిగా స్పందించే వ్యక్తిని, డ్రామాలు సృష్టించే వ్యక్తిని  ఖచ్చితంగా పెళ్లి చేసుకోకూడదు. చిన్న చిన్న విషయాలకే అతిగా వాదించే వ్యక్తిని, గంటలు గంటలు చర్చలు పెట్టే వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో మీరు చెప్పేది ఏ రోజైనా శాంతంగా వింటారనే నమ్మకం లేదు. 


Also read: మీరు రోజూ చేసే ఈ పనులు రక్తంలో షుగర్ స్థాయిలను పెంచేస్తాయ్, మానుకుంటే మంచిది














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.